పురం’పై వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరాలి 

15 Oct, 2022 08:56 IST|Sakshi
చౌళూరు రామకృష్ణారెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కుటుంబీకులు, నవీన్‌ నిశ్చల్‌, నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు

హిందూపురం: ‘చౌళూరు రామకృష్ణారెడ్డికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎనలేని గౌరవం. జగనన్న అంటే అపార అభిమానం. అందుకే కెనడాలో చదువుకున్న ఆయన, మంచి ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురంలో వైఎస్సార్‌ సీపీ జెండా కట్టి పార్టీకి పునాదులు వేశారు. పురంలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేయాలన్నదే ఆయన ఆశయం. అందువల్ల కార్యకర్తలంతా కలిసి 2024లో హిందూపురంలో వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేసి ఆయనకు ఆత్మకుశాంతి కలిగించాలి’ అని చౌళూరు సతీమణి జ్యోత్స్న, సోదరి మధుమతి, బావ నాగభూషణంరెడ్డి, ఇతర కుటుంబసభ్యులు పిలుపునిచ్చారు.

శుక్రవారం హిందూపురంలోని ఈడిగ ఫంక్షన్‌హాలులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రామకృష్ణారెడ్డి సంతాపసభ జరిగింది. ముందుగా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి కుటుంబీకులతో పాటు ఏపీ ఆగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని, మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి పార్టీ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులరి్పంచి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం రామకృష్ణారెడ్డి సతీమణి, సోదరి, ఇతర కుటుంబీకులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని, తప్పకుండా న్యాయం జరుగుతుందన్న దృఢ విశ్వాసం ఉందన్నారు. దోషులు ఎంతటివారైనా వారికి శిక్షపడాలన్నారు. 

ఐక్యంగా పోరాడదాం.. 
చౌళూరు హత్య కేసులో అనుమానాలు ఉన్నాయని ఏపీ అగ్రోస్‌ చైర్మన్‌ నవీన్‌ నిశ్చల్‌ అన్నారు. ఆయన ఇంటి ముందే చౌళూరును దారుణంగా హత్య చేశారంటే, హంతకుల వెనుక ఎవరో పెద్దలున్నారనిపిస్తోందన్నారు. హత్య కేసులోని అనుమానితుల్లో కొందరిని ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు. రామకృష్ణారెడ్డి ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో, ఎందుకోసం కష్టపడ్డారో దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

ఇకపై పిడికిలి బిగించి అందరం ఒక్కటై రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించినప్పుడే రామకృష్ణారెడ్డి  ఆత్మకుశాంతి, నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరామిరెడ్డి, ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, రత్నమ్మ,  మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కొండూరు మల్లికార్జున, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, రామచంద్రా, షాజియా, డైరెక్టర్లు లక్ష్మీనారాయణ, జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కొటిపి హనుమంతరెడ్డి, నాగరాజు, హబీబ్, చంద్ర, మహేశ్‌, దాదు, నక్కలపల్లి శ్రీరాములు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  

(చదవండి: చౌళూరు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది )

మరిన్ని వార్తలు