తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పెద్దమనసు.. ఆ రైతులకు 5వేల ఉచిత బోర్లు

15 Sep, 2022 17:56 IST|Sakshi

సాక్షి, అనంతపురం(రాప్తాడు): నియోజకవర్గంలో 5 వేల మంది రైతులకు తోపుదుర్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచితంగా బోరుబావులు తవ్వించి వారి కలను సాకారం చేస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాప్తాడుకు వచ్చిన ఆయన స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  

రూ.10 కోట్లతో బోర్ల ఏర్పాటు 
తోపుదుర్తి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా గతంలో రాప్తాడు నియోజకవర్గంలో రెండు వేల మంది రైతులకు ఉచితంగా బోరు బావులు తవ్వించినట్లు ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘వైఎస్సార్‌ జలకళ’ కార్యక్రమం కింద తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం కింద నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 600 మంది రైతులకు బోర్లు వేయించామన్నారు. బోర్లు వేయించాలంటూ ప్రభుత్వ లక్ష్యానికి మించి 10,600 దరఖాస్తులు అందడంతో తోపుదుర్తి కుటుంబం చర్చించి ట్రస్ట్‌ ద్వారా ఉచిత బోర్లు వేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇందులో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి వెయ్యి బోర్లు, ఆత్మకూరు, అనంతపురం రూరల్‌ మండలాలకు కలపి వెయ్యి బోర్లు వేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి తొలి విడతగా కనగానపల్లి మండలంలో 150, రాప్తాడులో 150, రామగిరిలో 100, చెన్నేకొత్తపల్లి మండలాల్లో 100 బోర్లు వేయిస్తామన్నారు. ఇవి పూర్తి కాగానే రెండో విడతలో మరో 500 బోర్లు వేయిస్తామన్నారు. ఇలా ప్రతి విడతలోనూ 500 బోర్లు వేయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అర్హులు వీరే..  
పేద రైతులు, ఇప్పటి దాకా బోర్లు వేయని రైతులు, ఎన్నిమార్లు బోర్లు వేసినా నీళ్లు పడని రైతులు మాత్రమే ఈ పథకం కింద అర్హులని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పేరూరు డ్యాం మరువ పారుతోందని, ఈ సారి దాదాపు 12 టీఎంసీల నీటిని పేరూరు డ్యాం నుంచి దిగువన పెన్నాలోకి వదిలినట్లు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదంతో పీఏబీఆర్‌ కుడికాలువ ద్వారా ప్రతి చెరువునూ నింపడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో భూగర్భజలాలు భారీగా పెరిగాయని, 200 అడుగుల్లోపే నీళ్లు పడే పరిస్థితి నెలకొందన్నారు.  

ప్రతి కార్యకర్త గడప గడపకూ వెళ్లాలి 
ప్రతి గడపకూ వెళ్లి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఈ మూడేళ్లలో ఒనగూరిన లబ్ధిని వివరించాలని కార్యకర్తలకు సూచించారు. గత ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టి వెళ్లిపోయినా ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిధులు సమకూర్చుకుంటూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 8,900 ఇళ్లు మంజూరయ్యాయని, మరో 8,500 ఇళ్ల నిర్మాణాలకు ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని పేదలు ఎవరైతే ఆప్షన్‌–3లో ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటారో వారందరికీ రూ.35 వేల రుణాన్ని ఎన్నికల లోపు కాంట్రాక్టింగ్‌ సంస్థకు తామే చెల్లించి, ఆ రుణాన్ని మాఫీ చేయిస్తామన్నారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ బోయ రామాంజినేయులు, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ జూటూరు శేఖర్, యూత్‌ మండల కన్వీనర్‌ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, బీసీ సెల్‌ నాయకుడు పసుపుల ఆది పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు