సోయా విక్రయానికి తెచ్చిన రైతుపై.. హమాలీ ఒక్కసారిగా..

19 Oct, 2023 08:21 IST|Sakshi
రైతును చికిత్స కోసం తరలిస్తున్న సీఐ శ్రీను

కిందపడిన గింజలు తీసుకెళ్తానని రైతు కోరడంతో..

ఆగ్రహించిన హమాలీ రేకుడబ్బాతో..

దాడి చేసిన హమాలీని అరెస్టు చేయాలంటూ డిమాండ్‌!

బాధిత రైతు శ్రీనివాస్‌ను ఏరియాస్పత్రికి తరలింపు..

ఆదిలాబాద్‌: భైంసా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ యార్డులో సోయా విక్రయానికి తెచ్చిన రైతుపై హమాలీ దాడి చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. లోకేశ్వరం మండలం వట్టోలికి చెందిన శ్రీనివాస్‌ సోయా విక్రయించేందుకు బుధవారం భైంసా యార్డుకు వచ్చాడు. బీట్‌ అనంతరం సోయాలు జల్లెడ పడుతుండగా కిందపడిన గింజలు తీసుకెళ్తానని రైతు కోరడంతో ఆగ్రహించిన హమాలీ రేకుడబ్బాతో కొట్టాడు.

దీంతో రైతుకు కంటి వద్ద తీవ్రగాయం కావడంతో ఆగ్రహించిన రైతులు గాంధీగంజ్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం గాంధీగంజ్‌లోకి వెళ్లి బీట్‌ నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న సీఐ ఎల్‌.శ్రీను, ఎస్సైలు శ్రీకాంత్‌, సందీప్‌ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. బాధిత రైతును ప్రథమ చికిత్స కోసం తరలించే క్రమంలో రైతులు అడ్డుకున్నారు. దాడి చేసిన హమాలీని అరెస్టు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టు చేస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాధిత రైతు శ్రీనివాస్‌ను ఏరియాస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మరిన్ని వార్తలు