'ఉక్కు' కోసం ఎందాకైనా.. 

7 Feb, 2021 04:51 IST|Sakshi
మద్దిలపాలెం జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న వామపక్షాలు

విశాఖ సాగర తీరాన ఎగిసిన ఆందోళన కెరటాలు

ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాల రాస్తారోకో

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని కేంద్రానికి హెచ్చరిక

సొంత గనులు కేటాయిస్తే మళ్లీ లాభాల బాట పట్టిస్తామని వెల్లడి  

సాక్షి, విశాఖపట్నం: ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖపట్నంలో ఆందోళనలు మిన్నంటాయి. ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలు నగరంలో ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి ప్రజా ద్రోహానికి పాల్పడతారా? అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆమరణ దీక్షలకు దిగుతామని హెచ్చరించాయి. శనివారం విశాఖ మద్దిలపాలెం కూడలిలో వామపక్షాలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఐద్వా, పీవోడబ్ల్యూ, హెచ్‌ఎంఎస్, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏపీఎంఎస్‌ మహిళా సంఘాల నాయకులతో పాటు వివిధ వర్గాల ప్రజలు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు యత్నించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకొని.. ఆ తర్వాత కొద్దిసేపటికే విడిచిపెట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ఎందాకైనా పోరాడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ద్వారకానగర్‌ బీవీకే కళాశాల సమీపంలో ఏపీ నిరుద్యోగ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించింది. మరోవైపు ఉక్కు కర్మాగారంలోని టీటీఐ వద్ద బీఎంఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని బీఎంఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.జగదీశ్వరరావు చెప్పారు. సొంత గనులు కేటాయించి స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. పెందుర్తిలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.  
ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు   

పాలకుల నిర్లక్ష్యంతోనే నష్టాలు..  
మూడు మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌.. ప్రస్తుతం 7.3 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. నాలుగేళ్లలో 203.6 శాతం వృద్ధి సాధించింది. 2010 నవంబర్‌ 17న దీనికి నవరత్న హోదా కూడా కల్పించారు. అత్యంత నాణ్యమైన ఉక్కును తయారుచేస్తూ దేశ విదేశాల్లో మంచి గుర్తింపు పొందింది. మొదట్నుంచీ లాభాల బాటలో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ అనంతర కాలంలో పాలకుల నిర్లక్ష్యంతో నష్టాలు చవిచూసిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించి సహకారం అందిస్తే.. స్టీల్‌ ప్లాంట్‌ మళ్లీ లాభాల్లోకి పయనిస్తుందన్నారు. 

వెంటనే ఉపసంహరించుకోండి.. 
గాందీనగర్‌ (విజయవాడసెంట్రల్‌): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ తెలిపింది. శనివారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు