కొండబారిడి దంపుడు బియ్యానికి గుర్తింపు

29 Apr, 2022 11:54 IST|Sakshi

కురుపాం: కురుపాం మండలానికి మారుమూలన ఉన్న కొండబారిడి గిరిజన మహిళల శ్రమకు ఫలితం దక్కేరోజు వచ్చింది. వ్యాపారం మరింత వృద్ధిచేసుకునే అవకాశం కలిగింది. గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు దంపుడు బియ్యాన్ని వ్యాపారంగా మలచుకున్నారు. 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. గ్రామంలో సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యాన్ని రోళ్లలో దంచి బియ్యంగా మలస్తున్నారు.

కిలో ప్యాకెట్ల రూపంలో ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నారు. వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్న మహిళల విజయగాథపై ఈ నెల 24న “దంపుడు బియ్యానికి కేరాఫ్‌ కొండబారిడి’ శీర్షికన “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. మహిళల శ్రమను, కొత్త ఆలోచనను ప్రశంసించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈనెల 26న తన ట్విట్టర్‌ ఖాతాలో “పార్వతీపురం మన్యం జిల్లాలోని కొండబారిడి మహిళలు దంపుడు బియ్యంతో వినూత్న వ్యాపారాన్ని మొదలు పెట్టారు. సభ్యులంతా కలిసి రోళ్లలో దంచిన బియ్యాన్ని విక్రయిస్తూ లాభం పొందుతున్నారు.

గిరిజన మహిళలు ఒక ఉపాధి మార్గాన్ని సృష్టించుకుని మైదాన ప్రాంత ప్రజలకు సరఫరా చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన గిరిజన సహకార సంస్థ చైర్పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతిరాణి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉద్యోగులను కొండబారిడి గ్రామానికి గురువారం పంపించారు. గిరిజన మహిళలకు గిట్టుబాటు ధర చెల్లించి దంపుడు బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా కొంత నగదును మహిళలకు చెల్లించినట్టు జీసీసీ అధికారులు తెలిపారు. జీసీసీ ఆధ్వర్యంలో కొండబారిడి దంపుడు బియ్యాన్ని మార్కెటింగ్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు స్పష్టం చేశారు.  

(చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి)

మరిన్ని వార్తలు