అనుసంధానికి ఆ ఐదు అంశాలే ఆటంకం!

9 Feb, 2023 05:04 IST|Sakshi

నదుల అనుసంధానంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదిక

ఏకాభిప్రాయ సాధనకు రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకపోవడంపై పెదవి విరుపు 

కడలిలో కలుస్తున్న జలాలను మళ్లిస్తే దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని వెల్లడి 

కెన్‌–బెట్వా తరహాలోనే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానం చేపడతామన్న కేంద్ర జల్‌శక్తి శాఖ 

సాక్షి, అమరావతి: రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం వల్లే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్‌–తాపి–నర్మద సహా దేశంలో ప్రాధాన్య నదుల అనుసంధానం ప్రక్రియలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తేల్చిచెప్పింది. కేవలం ఐదు అంశాలు మాత్రమే దీనికి ప్రధాన కారణమని తేల్చింది.

సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించి.. నదులను అనుసంధానం చేయడం ద్వారా సముద్రంలో కలుస్తున్న జలాలను మళ్లించి దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దీనిపై కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పందిస్తూ.. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేశామని.. కెన్‌–బెట్వా తరహాలోనే మిగతా ప్రాధాన్యత నదు­ల అనుసంధానం ప్రక్రియను చేపడతామని తెలిపింది.

ఎంపీ పర్‌భాత్‌భాయ్‌ సవాభాయ్‌ పటేల్‌ అధ్యక్షతన జల వనరుల విభాగంపై 31 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ బడ్జెట్‌ కేటాయింపులు, వినియోగం, పనుల ప్రగతిని సమీక్షించి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఇటీవల నివేదిక ఇచ్చింది.  

కెన్‌–బెట్వా తరహాలోనే చేస్తాం 
పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై కేంద్ర జల్‌శక్తి శాఖ సానుకూలంగా స్పందించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ మధ్య ఏకాభిప్రాయంతోనే కెన్‌–బెట్వా నదుల అనుసంధానం చేపట్టామని పేర్కొంది. ఆ నదుల అనుసంధానం తొలి దశ పనులకు 2020–21 ధరల ప్రకారం రూ.44,605 కోట్లు వ్యయం అవుతుందని, ఇందులో 90 శాతం అంటే రూ.39,317 కోట్లు కేంద్రం సమకూర్చుతోందని వెల్లడించింది.

మిగతా 10శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు సమకూర్చుతాయంది. ఇదే రీతిలో ప్రాధాన్యత నదుల అనుసంధానం పనులను చేపడతామని హామీ ఇచ్చింది. 

నివేదికలోని ప్రధానాంశాలివీ.. 
► కేంద్రం ప్రాధాన్యతగా ప్రకటించిన గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగా–పింజాల్, పర్‌–తాపి–నర్మదా నదుల అనుసంధానానికి ప్రధానంగా ఐదు అంశాలు అడ్డంకిగా మారాయి. 

► రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించకపోవడం, ఏకాభిప్రాయ సాధనకు సంప్రదింపులు జరపకపోవడం, నిధుల కొరత, అటవీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ–నిర్వాసితులకు పునరావాసం కల్పన అంశాలు నదుల అనుసంధానం ప్రక్రియ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణాలు. 

► ప్రయోజనం పొందే రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించి ఏకాభిప్రాయ సాధనపై కేంద్రం దృష్టి కేంద్రీకరిస్తే నదుల అనుసంధానానికి మార్గం సుగమం అవుతుంది.  

► నిధుల్లో సింహభాగం వాటాను కేంద్రం ఇవ్వడం, పన్ను రాయితీలను ఇవ్వడం ద్వారా రాష్ట్రాలను నదుల అనుసంధానానికి ఒప్పించవచ్చు. 

గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానంపై పీఠముడి 
ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జునసాగర్‌ (కృష్ణా), సోమశిల (పెన్నా) నదుల్లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రాండ్‌ ఆనకట్ట(కావేరి)కి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) తొలుత ప్రతిపాదించింది. ఆవిరి నష్టాలు పోనూ మూడు రాష్ట్రాలకు 80 టీఎంసీల చొప్పున ఇచ్చేలా ప్రతిపాదనలో పేర్కొంది. ఈ పనులకు రూ.85 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది.

ఈ ప్రతిపాదనపై ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోదావరిలో 75 శాతం లభ్యత ఆధారంగా మిగులు జలాలే లేవని.. అలాంటప్పుడు నీటిని ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏను నిలదీశాయి. దాంతో ఇచ్చంపల్లి నుంచి ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 141 టీఎంసీల గోదావరి జలాలను తరలించి ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు 40 టీఎంసీల చొప్పున, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ఇచ్చేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ఎన్‌డబ్ల్యూడీఏ చేసింది.

ఈ పనులకు రూ.45 వేల కోట్ల వ్యయం అవుతుందని లెక్కకట్టింది. దీన్ని కూడా బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. గోదావరిలో నీటి లభ్యత శాస్త్రీయంగా తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానంపై సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని కేంద్రానికి తేల్చి చెప్పాయి.   

మరిన్ని వార్తలు