ఉలవచారు బిర్యానీ చాలా ఇష్టం

9 Feb, 2023 04:55 IST|Sakshi

– శివ రాజ్‌కుమార్‌

‘‘ముప్పైఏళ్లుగా తెలుగువారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి ఉలవచారు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌ గార్లు, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌.. ఇలా అందరూ నాకు మంచి స్నేహితులు.. చాలా మోటివేట్‌ చేస్తారు’’ అని కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌కుమార్‌ అన్నారు.

ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శివ’. శివ రాజ్‌కుమార్‌ భార్య గీత నిర్మించిన ఈ చిత్రం కన్నడలో గత డిసెంబరు 23న రిలీజైంది. ఈ చిత్రాన్ని ‘శివ వేద’ పేరుతో వీఆర్‌ కృష్ణ మండపాటి నేడు తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా శివ రాజ్‌కుమార్‌ చెప్పిన విశేషాలు.

► రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నేను నటించిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’ (2016) చిత్రం తెలుగులో విడుదలైంది. ఆ సినిమాని ఇక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించడం హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ‘శివ వేద’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేస్తుండటం వెరీ హ్యాపీ.
► ‘వేద’ కన్నడలో విడుదలై 50 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మంచి ఆదరణ వస్తోంది. ‘శివ వేద’లో వినోదం, భావోద్వేగాలతో పాటు చక్కని సందేశం ఉంది. కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి? అనేది ఈ చిత్రంలో ఉంటుంది. ‘వేద’ అనేది క్యారెక్టర్‌ పేరు. లవ్, లైఫ్, హ్యాపీనెస్, ట్రస్ట్‌.. ఇవన్నీ వేద లైఫ్‌లో ఉంటాయి.
► ‘శివ వేద’ని కన్నడ, తెలుగులో ఒకే రోజు రిలీజ్‌ చేయాలనుకున్నాం. కానీ, పబ్లిసిటీకి సమయం లేకపోవ డంతో ఇక్కడ విడుదల చేయలేదు. కన్నడ, తమిళ్‌లో రిలీజ్‌ చేయగా మంచి హిట్టయ్యింది. తమిళంలోనూ బాగా ఆదరిస్తున్నారు. హర్షకి నాపై ఉన్న నమ్మకం వల్లే మా కాంబినేషన్‌లో ఎక్కువ సినిమాలు చేశాం.
► తెలుగు, కన్నడ ఇండస్ట్రీలు ప్రస్తుతం మంచి పొజిషన్‌లో ఉన్నాయి. పాన్‌ ఇండియా స్టార్‌ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. నేను కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు మాట్లాడగలను. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒకరే ఉండలేరు.. ఒకరి తర్వాత ఒకరు వస్తుంటారు కాబట్టి కొత్తవారిని ప్రోత్సహించాలి.
► భక్తి నేపథ్యంలో ఓ మూవీ చేయాలని ఉంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ బయోపిక్‌ తీసే ఆలోచన లేదు. ప్రస్తుతం రజనీ సార్‌తో ‘జైలర్‌’, ధనుష్‌తో ‘కెప్టెన్‌ మిల్లర్‌’ మూవీ చేస్తున్నాను. తెలుగులో రెండు, మూడు ప్రాజెక్ట్స్‌ విన్నాను.

మరిన్ని వార్తలు