లోన్‌యాప్‌, క్రికెట్‌ బెట్టింగ్‌కు రోహిత్‌ బలి.. నా కొడుకులా మరొకరు కాకూడదంటూ..

6 Jan, 2023 16:09 IST|Sakshi

సాక్షి, విజయవాడ: లోన్‌యాప్‌, క్రికెట్‌ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. ఎన్టీఆర్‌ జిల్లా వేలేరు గ్రామానికి చెందిన రోహిత్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ కోసం లోన్‌ యాప్‌లలో రుణం తీసుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో తిరిగి చెల్లించలేకపోయాడు. ఓ వైపు లోన్‌ యాప్‌ నిర్వాహకులు, మరోవైపు క్రికెట్‌ బుకీల వేధింపులు తాళలేక రెండు రోజుల క్రితం గడ్డిమందు తాగి రోహిత్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో రోహిత్‌ మృతదేహానికి గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 

ఘటనపై రోహిత్‌ తండ్రి కోదండరామయ్య మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగ్ వల్లే నాకొడుకు బలయ్యాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్‌లలో నా కొడుకుని మోసం చేశారు. 4వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి వెంటనే ఆస్పత్రిలో చేర్పించాం. రెండు రోజులు మృత్యువుతో పోరాడి నాకొడుకు మరణించాడు. హనుమాన్ జంక్షన్‌కు చెందిన జోజి సునీల్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేసినట్లు నా కొడుకు చెప్పాడు.

లోన్‌యాప్‌లో కూడా రూ.2.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. జోజి సునీల్, లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక, మాకు చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నా కొడుకు తెలిపాడు. రాజు అనే వ్యక్తికి 60 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షలు బ్యాంక్ ద్వారా పంపాడు. ఆ డబ్బులు అతనికి ఎందుకు ఇచ్చాడు, ఆ డబ్బులు ఎక్కడవి అనేది తెల్చాలి. నా కొడుకులా మరొకరు కాకూడదు. క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్‌లపై పోలీసులు నిఘా పెట్టాలి. కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని రోహిత్‌ తండ్రి కోదండరామయ్య కోరారు.

చదవండి: (Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..)

మరిన్ని వార్తలు