చంద్రబాబుది ఎందుకు పనికిరాని విజన్‌

1 Jan, 2021 16:02 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో మన రాష్ట్రం సమర్థంగా పనిచేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. (చదవండి: ఉందిలే మంచి కాలం..)

‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పిన 2020 విధానాల అమలుకు ప్రజలు అధికారం ఇచ్చినా 2018 నాడే 2050కి మారిపోయారు. 70 ఏళ్ల మనిషి 2050 అనడం హాస్యాస్పదం. ఐదేళ్ల తర్వాత అయితే ప్రజలు ప్రశ్నిస్తారని ఇలా విజన్‌లు పెట్టుకున్నారు. చంద్రబాబు దార్శనికత దురదృష్టం అయితే.. వైఎస్‌ జగన్ దార్శనికత ఒక అదృష్టం. ఎందుకూ పనికిరాని ఒక విజన్ ద్వారా ప్రజలను భ్రమపెట్టారు. ఆ రోజు దివంగత మహానేత వైఎస్సార్‌పై ఫ్యాక్షనిస్టు ముద్ర వేసి ప్రచారం చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంటే ఏమిటో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు తెలిసింది. ఆ తర్వాత వైఎస్‌ జగన్ విషయంలోనూ అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టారు. 2019 తీర్పు చూస్తే విశ్వనీయతకు పట్టం కట్టి వారి అబద్దాలను ప్రజలు తిప్పికొట్టారు. (చదవండి: న్యాయవాదుల బీమా పథకానికి శ్రీకారం)

ఈ ఏడాదిన్నరలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు వచ్చినా.. సంక్షేమాలు అమలు చేశారు. అదే చంద్రబాబు అయితే అధికారికంగా చేతులెత్తేసే వారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో దాన్ని నిలబెట్టేందుకు వైఎస్‌ జగన్ విశేష కృషి చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన తీరు దేశంలో ఎప్పుడూ లేదు. యజ్ఞం జరుగుతుంటే రాక్షసులు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ యజ్ఞం ద్వారా నిజమైన మహిళా సాధికారతకు దారి తీసింది. ఇలాంటిది చంద్రబాబు ఎందుకు చేయలేదు..?  ఆయన ఆలోచన ధోరణి వేరు. అధికారం తన చేతిలో కానీ, పార్టీ చేతిలో కాకుండా క్షేత్ర స్థాయికి తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్‌ది. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఎవరిని నమ్ముకుంటే తమ జీవితాలు బాగుపడతాయో వారికి తెలుసు. పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నాం. పోర్టులు వస్తున్నాయి. మూడు ప్రాంతాల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు