జ్వరాలొస్తున్నాయ్‌.. జాగ్రత్త! దడపుట్టిస్తున్న వైరల్‌ ఫీవర్‌, మలేరియా, డెంగీ వ్యాప్తి

4 Aug, 2022 04:25 IST|Sakshi

వాతావరణ మార్పులు, వర్షాలతో పెరుగుతున్న సీజనల్‌ వ్యాధులు 

ఇప్పటివరకు రాష్ట్రంలో 945 మలేరియా, 1,387 డెంగీ కేసులు నమోదు 

గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా మలేరియా కేసులు 

విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో డెంగీ ప్రభావం 

వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న వైద్య శాఖ  

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు  

సాక్షి, అమరావతి: వాతావరణంలో మార్పులు, వర్షాలతో రాష్ట్రంలో వైరల్‌ ఫీవర్‌; మలేరియా, డెంగీ వంటి సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మలేరియా ఎక్కువగా ఉంది. మిగిలిన ప్రాంతాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.98 లక్షల మందికి స్క్రీనింగ్‌ నిర్వహించగా 945 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 531, పార్వతీపురం మన్యంలో 238 కేసులు నమోదు అయ్యాయి.

ఐదు జిల్లాల్లో ఓ మోస్తరుగా, 13 జిల్లాల్లో నామమాత్రంగా కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 1,387 డెంగీ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 387 కేసులు ఉన్నాయి. విజయనగరంలో 173, కాకినాడలో 99, అనకాపల్లిలో 82 కేసులు నమోదయ్యాయి. డెంగీ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో నియంత్రణకు పారిశుధ్య నిర్వహణ, నీళ్లు నిల్వ ఉండకుండా చూడటం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. డెంగీకు సంబంధించి 54 ప్రభుత్వ బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రులను సెంటినల్‌ నిఘా ఆసుపత్రులుగా గుర్తించారు.

వ్యాధిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,34,270 టెస్ట్‌ కిట్‌లను పంపిణీ చేశారు. విశాఖపట్నంలో వైద్య సిబ్బందికి సెరా నమూనాలపై అవగాహన కల్పించారు.  మలేరియా ఎక్కువగా ఉన్న ఏఎస్‌ఆర్, పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు, అనకాపల్లి, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో నియంత్రణ చర్యలను వైద్య శాఖ చేపట్టింది. వ్యాధి ఎక్కువగా ఉన్న 4–5 గ్రామాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. దోమల నుంచి రక్షణ కోసం 25.94 లక్షల దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది.

పరిసరాలను పరిశుభ్రతకు, దోమల నివారణకు చర్యలు చేపడుతోంది. వెక్టార్‌ కంట్రోల్,  ఏఎన్‌ఎంలు వారి పరిధిలో అపరిశుభ్రంగా, నీరు నిలిచిన ప్రాంతాల ఫోటోలను హైజీన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. వెంటనే గ్రామ/వార్డు కార్యదర్శులు అక్కడి సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ఫ్రైడే–డ్రై డే ప్రచార కార్యక్రమం ప్రతి శుక్రవారం అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
► ఇంటి ఆవరణ, చుట్టుపక్కల పనికిరాని వస్తువులు, టైర్లు, వాడిన కొబ్బరి చిప్పలు ఉంచరాదు. 
► మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి 
► నీటిని నిల్వ చేసే పాత్రలు శుభ్రపరచి, వాటిపై మూతలు ఉంచాలి 
► ఆర్‌వో నీటిని లేదా కాచి వడగట్టిన నీటిని తాగాలి 
► తాజా కాయగూరలు, వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి 
► దోమ తెరలు వినియోగించాలి. గర్భిణిలు, చిన్న పిల్లలకు దోమతెరలు తప్పనిసరి  

నిర్లక్ష్యం చేయద్దు 
జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు, వాంతులు సహా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. సొంత వైద్యం చేసుకోకూడదు. సీజనల్‌ వ్యాధులపై వైద్య శాఖ అప్రమత్తంగా ఉంది. జ్వర బాధితులకు వైద్య పరీక్షలు చేస్తున్నాం. ఫీవర్‌ సర్వే కొనసాగిస్తున్నాం.  
– డాక్టర్‌ రామిరెడ్డి, రాష్ట్ర సీజనల్‌ వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఏడీ

ప్రాథమిక దశలోనే గుర్తించాలి 
వాతావరణంలో మార్పుల వల్ల వైరల్‌ ఫీవర్‌ (విష జ్వరం)లు ఎక్కువగా వస్తాయి. దోమల ద్వారా మలేరియా, డెంగీ, ఇతర వ్యాధులు వస్తాయి. అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం కీలకం. జ్వరం, ఇతర అరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించి మందులు వాడాలి. ఇంట్లో ఇతరులకు దూరంగా ఉండాలి. వర్షంలో తడవకూడదు. మాస్క్‌ ధరించాలి. మాస్క్‌ వల్ల కరోనాతోపాటు  ఇతర వ్యాధులు, వైరస్‌లు, భ్యాక్టీరియాల నుంచి రక్షణ లభిస్తుంది.
 – డాక్టర్‌ రఘు, గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌  

మరిన్ని వార్తలు