శానిటైజర్లు తాగుతున్న వారి కోసం ఎస్‌ఈబీ వేట 

9 Aug, 2020 05:24 IST|Sakshi

ఇప్పటివరకు 144 మంది అదుపులోకి 

కౌన్సెలింగ్‌తో డీ–అడిక్షన్‌ కేంద్రాలకు పంపుతున్న అధికారులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకు శానిటైజర్లు తాగుతున్న 144 మందిని స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా శానిటైజర్లు తాగి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటున్న వారిని గుర్తించే పనిలో ఎస్‌ఈబీ అధికారులు నిమగ్నమయ్యారు. వీరికి కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు డీ–అడిక్షన్‌ కేంద్రాలకు పంపుతున్నారు. మద్యానికి బానిసైన వారు మాత్రమే శానిటైజర్లు తాగుతున్నారని, వీరి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి మద్యం వ్యసనపరుల గురించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్‌ కేంద్రాలతో పాటు ప్రైవేటు కేంద్రాల్లోనూ  కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నారు.  

► శానిటైజర్లలో మిథైల్‌ ఆల్కహాల్‌ బదులుగా మిథైల్‌ క్లోరైడ్‌ కలుపుతున్నట్లు ల్యాబ్‌ పరీక్షల్లో ఫలితాలు వస్తున్నాయి. 
► శానిటైజర్లు తాగి మృత్యువాత పడుతున్న ఘటనల్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశిస్తున్నారు.  
► ఎస్‌ఈబీతో పాటు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేస్తున్నారు.  
► కురిచేడు ఘటనపై గత ఐదు రోజుల నుంచి ఎక్సైజ్, ఎస్‌ఈబీ, పోలీసు బృందాలు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు శానిటైజర్‌ తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి.  
► రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాల్ని గుర్తించి వాటిపై నిఘా ఉంచామని, ఎవరైనా పట్టుబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు