ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు?

25 Sep, 2023 12:26 IST|Sakshi

కెనడాలో ఉంటున్న ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) స్వాధీనం చేసుకున్న నేపధ్యంలో విదేశాలలో ఇదేరీతిలో తలదాచుకున్న ఇతర ఉగ్రవాదుల ఆస్తులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కోరింది. యుఎస్, యుకె, కెనడా, ఆస్ట్రేలియాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులను గుర్తించాలని, వారు భారతదేశానికి తిరిగి రాకుండా వారి విదేశీ పౌరసత్వాన్ని (ఓసిఐ) రద్దు చేయాలని ప్రభుత్వం ఆ ఏజెన్సీలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) స్వాధీనం చేసుకున్న దరిమిలా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఫలితంగా భారతదేశానికి చెందిన ఈ ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందదని, అప్పుడు వారు ఇక్కడికి వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా, బ్రిటన్, కెనడా, యూఏఈ, పాకిస్తాన్ తదితర దేశాల్లో పరారీలో ఉన్న 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులను ప్రభుత్వం గుర్తించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

గతంలో కెనడా, యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్‌లో నివసిస్తున్న 11 మందిని గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదులుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. వీరిలో ఎనిమిది మంది అనుమానితులు కెనడాలోనే ఉన్నట్లు అధికారవర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ జాబితాలో గ్యాంగ్‌స్టర్లు, ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి.  పాకిస్తాన్‌లో హర్విందర్ సంధు అలియాస్ రిండా ఉన్నాడని భావిస్తున్నారు. లఖ్‌బీర్ సింగ్ అలియాస్ లాండా, సుఖ్దుల్ సింగ్ అలియాస్ సుఖ దునాకే (మూడు రోజుల క్రితం హతమయ్యాడు), అర్ష్‌దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా, రమణదీప్ సింగ్ అలియాస్ రామన్ జడ్జి, చరణ్‌జిత్ సింగ్ అలియాస్ రింకూ బిహాలా, సనావర్ ధిల్లాన్, గుర్పిందర్ సింగ్ అలియాస్ బాబా డల్లా కెనడాలో ఉన్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక అమెరికాలో గౌరవ్ పత్యాల్ లక్కీ, అన్మోల్ బిష్ణోయ్‌లు ఉన్నారనే అనుమానాలున్నాయి.

ప్రభుత్వం చేపడుతున్న తాజా చర్యలు ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా కార్డులతో విదేశాల్లో నివసిస్తున్న ఉగ్రవాదుల కార్యకలాపాలను అరికట్టడానికి సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వారు భారతదేశంలో ఉద్యమాలు చేపట్టి, యువతను తప్పుదారి పట్టించేందుకు అవకాశం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 
ఇది కూడా  చదవండి: భారత్‌- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు?

మరిన్ని వార్తలు