35 రోజుల్లో 6 లక్షల బియ్యం కార్డులు

30 Oct, 2020 03:10 IST|Sakshi

లంచాలు, సిఫారసు లేకుండానే గడువులోగా పథకాల మంజూరు

గత సర్కారు హయాంలో ఏళ్లు గడిచినా అర్హులకు దిక్కులేదు

నేడు అర్హులైతే పది రోజుల్లోనే బియ్యం కార్డు.. సభ్యుల చేరిక లేదా తొలగింపు

35 రోజుల్లో అర్హులైన 78,372 మందికి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక 

38,830 మందికి ఆరోగ్య శ్రీ కార్డులు

ఉన్న ఊళ్లోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో మంజూరు

గడువులోగా 99 శాతం మంజూరు.. 100 శాతం ఇవ్వాల్సిందే అంటున్న సీఎం 

సాక్షి, అమరావతి : గత చంద్రబాబు సర్కారులో అర్హులైన వారికి రేషన్‌ కార్డు, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీలు, మండల కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాల్సి వచ్చేది. అయినా సరే కొత్తగా రేషన్‌ కార్డు గానీ పెన్షన్‌ గానీ మంజూరు అయ్యేది కాదు. ఎక్కడైనా అరకొరగా మంజూరైనా లంచాలతో పాటు అప్పటి అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే దక్కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అర్హులైన లబ్ధిదారులకు ఉన్న ఊళ్లల్లోనే బియ్యం కార్డు, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డులను నిర్ణీత గడువులోగా ఎవరి సిఫార్సులు, లంచాలు లేకుండానే మంజూరు చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధత, చిత్తశుద్ధేనని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది.

అర్హతే ప్రామాణికం

  • ఈ ఏడాది సెప్టెంబర్‌ 14 నుంచి అక్టోబర్‌ 19వ తేదీ వరకు అంటే 35 రోజుల్లో 6,11,824 మందికి బియ్యం కార్డులు మంజూరు చేశారు. సీఎం నిర్ధారించిన పది రోజుల గడువులోగానే ఇవన్నీ మంజూరు చేశారు.
  • ఇందులో పెళ్లిళ్లు అయ్యి కొత్త కాపురం పెట్టుకున్న వారికి కొత్తగా బియ్యం కార్డు మంజూరుతో పాటు ఎవరైనా కార్డులో కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చడం, లేదా కార్డులో నుంచి పేరును విడదీయడం వంటివి కూడా ఉన్నాయి. 
  • దరఖాస్తు చేసుకున్నాక నిర్ణీత గడువులోగా 35 రోజుల్లో 99 శాతం మందికి బియ్యం కార్డులు అందాయి. వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వాటిని అందజేశారు.  

ఎలాంటి సిఫార్సులూ అక్కరలేదు

  • 35 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన 78,372 మందికి కొత్తగా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక మంజూరు చేశారు. అర్హులైన 99 శాతం మందికి పది రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేశారు. గత సర్కారులో అర్హులు ఎవరైనా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ ఊరిలో ఎవరైనా మృతి చెందితేనే ఆ స్థానంలో కొత్త పెన్షన్‌ ఇచ్చే వారు. అది కూడా జన్మభూమి కమిటీ సిఫార్సులు మేరకు మంజూరు చేసేవారు. ఇప్పుడు అర్హత ఉంటే చాలు సంతృప్త స్థాయిలో ఎవరి సిఫార్సులు లేకుండా పెన్షన్‌ మంజూరు చేస్తున్నారు.
  • 35 రోజుల్లో అర్హులైన 38,830 మందికి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డులను దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే మంజూరు చేశారు. 

గడువులోగా నూరు శాతం ఇవ్వడమే లక్ష్యం 
ప్రస్తుతం నిర్ణీత గడువులోగా అంటే పది రోజుల్లోనే పెన్షన్, బియ్యం కార్డులను 99 శాతం మందికి మంజూరు చేస్తున్నప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతృప్తి చెందడం లేదు. నూటికి నూరు శాతం మందికి నిర్ణీత గడువులోగా మంజూరు చేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గతంలో అర్హత ఉన్న వారికి కూడా సంవత్సరాల తరబడి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా అన్నీ మంజూరు చేస్తున్నాం. ఇందుకు ముఖ్యమంత్రి నిబద్ధత, చిత్తశుద్ధే కారణం. స్వయంగా ముఖ్యమంత్రే వీటిని పర్యవేక్షిస్తున్నారు.  – అజయ్‌ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు