AP: ఎస్‌ఎల్‌బీసీ నివేదిక.. వారికి భారీగా రుణాలు

14 Jun, 2022 09:21 IST|Sakshi

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీగా రుణాలు 

మూడేళ్లల్లో రూ.48,690 కోట్ల మేర అదనపు రుణాలు

రూ.28,577 కోట్లకు చేరిన ఎస్సీ, ఎస్టీల మొత్తం రుణాలు

రూ.1.26 లక్షల కోట్లకు చేరిన బలహీన వర్గాల మొత్తం రుణాలు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ పథకాల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు విరివిగా రుణాలు అందుతున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) తాజా నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాల్లో 80.97 శాతం వృద్ధి నమోదు కాగా బీసీలకు ఇచ్చిన రుణాల్లో 39.61 శాతం వృద్ధి నమోదైంది.
చదవండి: ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? 

2019–20లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ.15,791 కోట్లు ఉండగా 2021–22 నాటికి రూ.28,577 కోట్లకు పెరిగింది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల్లో 2019–20లో ఏడు శాతం వృద్ధి నమోదైతే తర్వాత రెండేళ్లు వరుసగా 18 శాతం, 53 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అంతేకాకుండా గత మూడేళ్లల్లో బీసీ వర్గాలకు రుణాలు రూ.90,624 కోట్ల నుంచి రూ.1,26,528 కోట్లకు చేరాయి. కోవిడ్‌ సమయంలో బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పెద్దఎత్తున రుణాలను మంజూరు చేయడంతో భారీ వృద్ధి నమోదైనట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

సంక్షేమ పథకాలతో చేయూత
వైఎస్సార్‌ బడుగు వికాసం, స్వయం సహాయక సంఘాలు, జగనన్న తోడు, పీఎం ముద్ర, పీఎం స్వనిధి, స్టాండప్‌ ఇండియా తదితర పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారాలు చేసుకునే వారికి రెండు దశల్లో 9.05 లక్షల మందికి రుణాలను మంజూరు చేయగా ఈ ఏడాది మూడో దశలో 9 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందులో ఇప్పటికే 5.10 లక్షల మందికి మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద ఇప్పటికే రూ.32.51 కోట్లు బ్యాంకులకు చెల్లించడంతో 7.06 లక్షల మంది లబ్థిదారులకు ప్రయోజనం చేకూరింది. 

మరిన్ని వార్తలు