పోలీసులపై ‘సంగం’ దౌర్జన్యం

25 Nov, 2023 03:26 IST|Sakshi

డెయిరీ లోపలికి రాకుండా అడ్డుకున్న టీడీపీ, సిబ్బంది 

చేబ్రోలు: తమకు బకాయి ఉన్న బోనస్‌ డబ్బులను చెల్లించాలని కోరిన ఏలూరు జిల్లా పాడి రైతులపై దాడి చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై సంగం డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాలు పోసిన రైతులకు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సుమారు రూ.50లక్షల బోనస్‌ డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారంటూ సంగం డెయిరీ సిబ్బందిని నిలదీసిన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం, వేములపల్లి గ్రామాలకు చెందిన పాడి రైతులపై చైర్మన్‌ ధూళి­పాళ్ల  నరేంద్రకుమార్‌ అనుచరులు దాడి చేసిన విషయం విదితమే.

డెయిరీ సిబ్బంది, ధూళిపాళ్ల అనుచరులు సుమారు వందమంది విచక్షణార­హితంగా కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడంతో 15మంది రైతులకు కాళ్లు, చేతులు విరగడంతోపాటు తీవ్ర గాయాల­య్యాయి. మూడు కార్లు ధ్వంసం కావడంతో రూ.ఐదు లక్షల మేర నష్టం జరిగింది. అప్పట్లో  బాధిత రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రతోపాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే కేసులోని కొంతమందిని అరెస్ట్‌ చేశారు.

మరికొందరు నిందితులు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో తలదాచుకున్నారన్న సమాచారం అందుకు­న్న పొన్నూరు రూరల్‌ సీఐ ఎం.రాంబాబు, చేబ్రోలు ఎస్‌ఐ కె.ఆనంద్, పొన్నూరు ఎస్‌ఐ బార్గవ్, పోలీసు సిబ్బంది శుక్రవారం డెయిరీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకు­న్నారు. వీరి రాకను ముందే పసిగట్టిన డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకు­న్నారు. మార్కెటింగ్‌ మేనేజర్‌ శ్రీధర్, డీఈ వెంకటేశ్వరరావు తదితరులు పోలీసులు అనుమతి లేకుండా సంగం డెయిరీలోకి ప్రవేశించడానికి వీలులేదని తెలిపారు.

ఏలూరు రైతులపై దాడి కేసులో నిందితులు డెయిరీలో ఉన్నారని.. వారి కోసం వచ్చినట్లు సీఐ, ఎస్‌ఐలు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. సెర్చ్‌ వారెంట్, రెవెన్యూ అనుమతి కావాలని చెప్పడంతో ఇరువురు వీఆర్వోలు ఉన్నారని చూపినప్పటికీ లోపలికి రావడానికి వీల్లేదని పట్టుబట్టారు. సంగం డెయిరీ సిబ్బందితోపాటు, నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు, పొన్నూరు, పెదకాకాని మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి తర్వాత  పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

మరిన్ని వార్తలు