స్మార్ట్‌ టౌన్ల ప్రాజెక్ట్‌ టేకాఫ్‌

25 Mar, 2021 03:19 IST|Sakshi

సకల వసతులతో లే అవుట్ల అభివృద్ధి

ఎంఐజీ–1, ఎంఐజీ–2 కేటగిరీల్లో ప్లాట్లు

లాభాపేక్ష లేకుండా మధ్య తరగతికి అందుబాటులో పురపాలక శాఖ ప్రణాళికకు ఆమోదం 

సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులతో లే అవుట్లను లాభాపేక్ష లేకుండా అందించేందుకు ఉద్దేశించిన స్మార్ట్‌ టౌన్ల ప్రాజెక్టు వేగంగా సిద్ధమవుతోంది. విస్తరిస్తున్న నగరాలు, పట్టణాల్లో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. అనధికారిక, సరైన మౌలిక వసతులులేని లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు ఊరట కలిగించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. పురపాలక శాఖ పూర్తి వసతులతో లే అవుట్లను అభివృద్ధి చేసిందుకు  ‘స్మార్ట్‌ టౌన్ల’ ప్రాజెక్టును రూపొందించింది. 

ప్రతి పట్టణ స్థానిక సంస్థ పరిధిలో ఒకటి చొప్పున  స్మార్ట్‌ టౌన్ల లే అవుట్లు అభివృద్ధి చేస్తారు. పట్టణ స్థానిక సంస్థ జనాభాను బట్టి ఒక్కో లే అవుట్‌ 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు ఉండాలని నిర్ణయించారు. 
► విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో 200 ఎకరాలు చొప్పున లేఅవుట్లు వేస్తారు. 
► మిగిలిన 14 కార్పొరేషన్లలో 100 ఎకరాల చొప్పున లేఅవుట్లు రూపొందిస్తారు. 
► 13 స్పెషల్‌ గ్రేడ్, సెలక్షన్‌ గ్రేడ్‌ మునిసిపాలిటీలలో 75 ఎకరాల చొప్పున లే అవుట్లు అభివృద్ధి చేస్తారు. 63 గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 2.. గ్రేడ్‌ 3 మున్సిపాలిటీలలో 50 ఎకరాల చొప్పున లేఅవుట్లు వేస్తారు.
► 31 నగర పంచాయతీల్లో 25 ఎకరాల చొప్పున లేఅవుట్లు నిర్మిస్తారు. 

రెండు కేటగిరీల కింద స్థలాలు
స్మార్ట్‌ టౌన్‌ లే అవుట్లలో రెండు కేటగిరీల కింద స్థలాలు కేటాయిస్తారు. మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌ (ఎంఐజీ)–1 కేటగిరీ కింద 200 చ.గజాలు, మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూప్‌(ఎంఐజీ)–2 కేటగిరీ కింద 240 చ.గజాల విస్తీర్ణంలో స్థలలతో లే అవుట్లు వేస్తారు. 

స్మార్ట్‌ టౌన్లలో కల్పించే వసతులు..
► లే అవుట్‌లో రోడ్లకు 30 శాతం, ఓపెన్‌ స్పేస్‌కు 10 శాతం, మౌలిక వసతుల కల్పనకు 5 శాతం, యుటిలిటీస్‌కు 1 శా>తం, పేదల ప్లాట్ల కోసం 5 శాతం భూమిని కేటాయిస్తారు. 
► కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం, షాపింగ్‌ సెంటర్, బ్యాంక్, వార్డు సచివాలయం, అంగన్‌వాడీ కేంద్రం, మార్కెట్, వాకింగ్‌ ట్రాక్, పిల్లల ఆట స్థలాలకు భూములు కేటాయిస్తారు. 
► నీటి సరఫరా, ఓవర్‌హెడ్‌ ట్యాంక్, వీధి దీపాలు, డ్రైనేజ్, విద్యుత్‌ సబ్‌స్టేషన్, ప్లాంటేషన్, సోలార్‌ ప్యానళ్లు మొదలైనవి ఏర్పాటు చేస్తారు. 

భూముల ఎంపికకు మార్గదర్శకాలు ఇవీ...
ప్రజల అన్ని అవసరాలకు అందుబాటులో ఉండే ప్రాంతంలోని భూములనే స్మార్ట్‌ టౌన్ల ప్రాజెక్టుకు ఎంపిక చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. భూ సేకరణ కోసం రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి కమిటీలకు నిర్దేశించిన మార్గదర్శకాలు ఇవీ... 
► మున్సిపల్‌ కార్పొరేషన్లలో గరిష్టంగా 5 కి.మీ. పరిధిలోపు, మున్సిపాలిటీలలో గరిష్టంగా 3 కి.మీ. పరిధిలోపు ఉన్న భూములను ఎంపిక చేయాలి.
► ఉపాధి అవకాశాలు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి.
► పాఠశాలలు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు  అందుబాటులో ఉన్న ప్రాంతంలో భూములను గుర్తించాలి.  
► వివాదాస్పదం కాని భూములను ఎంపిక చేయాలి.
► ఎంపిక చేసిన భూములకు ఇప్పటికే అప్రోచ్‌ రోడ్డు ఉండాలి. 
► సరైన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి అనువుగా భూములను ఎంపిక చేయాలి.
► చెరువులు, నీటి వనరుల సమీపంలో ఉన్న భూములను ఎంపిక చేయకూడదు.
► భూగర్భ జలాలు తగినంతగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలి.
► జగనన్న కాలనీలకు సమీపంలో ఉండే ప్రాంతానికి ప్రాధాన్యమివ్వాలి.  

అన్ని వసతులతో స్మార్ట్‌ టౌన్లు
– వి.రాముడు, డైరెక్టర్, రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం
‘పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అనధికారిక లే అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసి సామాన్యులు మోసపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్‌ టౌన్ల ప్రాజెక్టును ప్రభుత్వం రూపొందించింది. అన్ని వసతులతో కూడిన లే అవుట్లలో స్థలాలను లాభాపేక్ష లేకుండా ప్రజలకు అందించనున్న ఈ ప్రాజెక్టును త్వరలోనే అందుబాటులోకి తెస్తాం’

మరిన్ని వార్తలు