ఇక సోలార్‌ వాటర్‌ ఏటీఎంలు

30 Sep, 2021 04:57 IST|Sakshi

అందుబాటులోకి తెస్తున్న ‘నెడ్‌క్యాప్‌’

స్మార్ట్‌ సిటీల్లో ఏర్పాటుకు అనుకూలం 

వీటినుంచి ఆర్వో ప్లాంట్ల కంటే నాణ్యమైన తాగునీరు

సాక్షి, అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సోలార్‌ వాటర్‌ ఏటీఎంలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ఆర్వో ప్లాంట్ల కంటే నాణ్యమైన తాగునీటిని అందించనున్నాయి. విద్యుత్‌ అవసరం లేకుండా కేవలం సౌర శక్తితోనే ఇవి పనిచేస్తాయి. వీటి ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌ క్యాప్‌) ముందుకొచ్చింది. ఈ పరిజ్ఞానం కావలసిన వారి నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను ఆహ్వానిస్తోంది. సోలార్‌ వాటర్‌ ఏటీఎంలపై స్మార్ట్‌ సిటీల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.

స్మార్ట్‌ సిటీలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థల కార్యాలయాలు, ఆలయాలు, పార్కులు, బస్టాండ్లు, ఆస్పత్రుల్లో వాటర్‌ ఏటీఎంల ఏర్పాటుకు అనువుగా ఉంటాయని భావిస్తున్నారు. ఒడిశాలోని కోణార్క్‌ స్మార్ట్‌ సిటీ సూర్య దేవాలయంలో సోలార్‌ ఏటీఎంలను పెట్టారు. అక్కడ విజయవంతంగా నడుస్తుండటంతో మన రాష్ట్రంలోనూ వీటిని ప్రవేశపెట్టడానికి నెడ్‌క్యాప్‌ ముందుకొచ్చింది. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో అయితే మునిసిపల్‌ వాటర్‌ పైప్‌లైన్లను వీటికి కనెక్ట్‌ చేస్తారు. ఆ నీటిని స్టోరేజీ ట్యాంకులో నిల్వ చేసి ప్యూరిఫై చేస్తారు. 

తిరుపతి స్మార్ట్‌ సిటీ ఆసక్తి
సోలార్‌ స్మార్ట్‌ వాటర్‌ ఏటీఎంలపై తిరుపతి స్మార్ట్‌ సిటీ ఆసక్తి కనబరుస్తోంది. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లకు తమ వద్ద ఉన్న సోలార్‌ వాటర్‌ ఏటీఎంల పరిజ్ఞానంపై సమాచారం ఇస్తున్నట్టు నెడ్‌క్యాప్‌ జనరల్‌ మేనేజర్‌ (టెక్నికల్‌) జగదీష్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. 

ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానం
రాష్ట్రంలో సోలార్‌ స్మార్ట్‌ వాటర్‌ ఏటీఎం ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణకు (ఈఓఐ) నెడ్‌క్యాప్‌ తాజాగా ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు తమ బిడ్లను అక్టోబర్‌ 8వ తేదీ లోగా దాఖలు చేయాలని పేర్కొంది. 11వ తేదీన టెక్నికల్, ఫైనాన్షియల్‌ బిడ్లను తెరవనున్నారు.

డబ్బు చెల్లిస్తే నీళ్లొస్తాయి
గూగుల్‌/ఫోన్‌పే ద్వారా సరిపడిన మొత్తాన్ని చెల్లించి సోలార్‌ వాటర్‌ ఏటీఎంల నుంచి నీటిని పొందవచ్చు. 250 ఎంఎల్, లీటరు, 10 లీటర్ల పరిమాణంలో నీటిని తీసుకునే వీలుంటుంది. సోలార్‌ ఏటీఎంల్లో నార్మల్‌ వాటర్‌తో పాటు కూలింగ్‌ చేసే చిల్లర్‌లు కూడా ఉంటాయి. బటన్‌ నొక్కి ఏ నీరు కావాలనుకుంటే ఆ నీరు పొందవచ్చు. ఇవి గంటకు 500 లీటర్ల నీటినిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నీటిలో ఫ్లోరైడ్‌ను తొలగించగలిగే పరిజ్ఞానం ఈ ఏటీఎంలలో ఉంటుంది. వీటిలో అల్ట్రా ఫిల్టరేషన్‌ యూనిట్లు ఉంటాయి. పైగా వీటి నుంచి వచ్చే నీటిలో నాణ్యతా ప్రమాణాలు డిస్‌ప్లే అవుతాయి. ప్యూరిఫై చేయడంలో నెడ్‌క్యాప్‌ పరిజ్ఞానంతో తయారైన సోలార్‌ ఏటీఎంలో నీరు ఆర్వో ప్లాంట్లకంటే నాణ్యత కలిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు