రాయలసీమ గర్జనకు భారీగా తరలిరానున్న ప్రజలు...పటిష్ట బందోబస్తు

5 Dec, 2022 08:26 IST|Sakshi

దశాబ్దాల తరబడి కొనసాగుతున్న అన్యాయంపై గళమెత్తేందుకు రాయలసీమ వాసులు సిద్ధమయ్యారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు ఉద్యమ బాట పట్టారు. ‘రాయలసీమ గర్జన’ పేరుతో సోమవారం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు అన్ని వర్గాల ప్రజలు తరలి రానుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 

కర్నూలు(రాజ్‌విహార్‌): రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను జేఏసీ ఏర్పాటు చేసింది. దీనికి మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాయలసీమ గర్జనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సభకు కర్నూలుతో పాటు నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, తిరుపతి, చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.  

గర్జనకు సంపూర్ణ మద్దతు  
రాయలసీమ గర్జనకు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు. సీమకు జరిగిన అన్యాయాన్ని వినిపించేందుకు రాయలసీమ జేఏసీ నిర్వహించే సభను జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం మంత్రులతో పాటు అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ సభా స్థలాన్ని సందర్శించారు.

రాయలసీమ జేఏసీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు నియోజకవర్గ పరిశీలకుడు కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, రాయలసీమ జేఏసీ విద్యార్థి సంఘం చైర్మన్‌ శ్రీరాములు, కన్వీనర్లు చంద్రప్ప, సునిల్‌రెడ్డి, మణిరెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపొగు ప్రశాంత్, పార్టీ నాయకులు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, తెర్నెకల్‌ సురేందర్‌రెడ్డి, సీహెచ్‌ మద్దయ్య, తోట వెంకట కృష్ణారెడ్డి, అక్కిమి హనుమంతరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, ధనుంజయ ఆచారి, సత్యం యాదవ్‌ పాల్గొన్నారు.  

పటిష్ట బందోబస్తు 
కర్నూలు: రాయలసీమ గర్జన కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ తెలిపారు.  ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో బందోబస్తుకు వచ్చిన సిబ్బందితో సమావేశం అయ్యారు. ఎస్టీబీసీ కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి సామర్థ్యంతో పోలీసులు పనిచేయాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ సభ దాదాపు మూడు గంటల పాటు సాగుతుందని, మైదానం జనాలతో నిండిన తర్వాత బయట నుండి ఎక్కువ మంది లోపలికి రాకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమం పూర్తిగా ముగిసే వరకు సిబ్బందికి కేటాయించిన స్థానాల్లోనే ఉండాలన్నారు. హోంగార్డు స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అప్రమత్తంగా పనిచేయాలని, ఏమైనా సమస్యలు ఉంటే సత్వరమే స్పందించి పై అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అడిషనల్‌ ఎస్పీలు కృష్ణకాంత్‌ పటేల్, డి.ప్రసాద్, నాగబాబు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.  

న్యాయ రాజధానితోనే అభివృద్ధి  
న్యాయ రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని రాయలసీమ జేఏసీ చైర్మన్‌ (నాన్‌ పొలిటికల్‌), చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమకు జరిగిన అన్యాయాన్ని దశాబ్దాలుగా విన్నవిస్తూ వస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి కర్నూలుకు  హైకోర్టును మంజూరు చేస్తే కొందరు అడ్డుకుంటున్నారన్నారు.

ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్ని వర్గాలు కలిసి ఉద్యమిస్తే న్యాయరాజధాని కర్నూలుకు వస్తుందన్నారు. సోమవారం కర్నూలులో జరిగే రాయలసీమ గర్జనకు అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలిరావాలని కోరారు. రాయలసీమ విద్యార్థి జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప మాట్లాడుతూ కర్నూలుకు హైకోర్టును మంజూరు చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకోవడం తగదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజల మద్దతుతో న్యాయ రాజధాని సాధించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు టీవీ రత్న ప్రసాద్, మాలిక్‌బాషా, రాజశేఖర్, బార్‌ అసోసియేషన్‌ సుబ్బయ్య, సునిల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, సుబ్బయ్య, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పెద్ద మనుషుల ఒప్పందం అమలు చేయాలి 
వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ వినిపిస్తున్న నేపథ్యంలో 1937లో పెద్ద మనుషులు రాజధాని లేదంటే హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఒప్పందం చేసుకున్నారు. మద్రాసు నుంచి విడిపోయిన తర్వాత కర్నూలు కొన్ని రోజులు రాజధానిగా ఉండేది. అయితే అనతి కాలంలోనే దానిని హైదరాబాద్‌కు తరలించారు. రాష్ట్ర విభజన సమయంలోనూ  ఇక్కడి ప్రజల డిమాండ్‌ను పట్టించుకోలేదు. అధికార వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలు ఇచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దానిని తుంగలోకి తొక్కారు.  

రాజధానితో పాటు హైకోర్టు, అసెంబ్లీ, ఐటీ హబ్, హెల్త్‌ సిటీ, టూరిజం హబ్‌ వంటివి అన్నీ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు  రైతుల నుంచి వేల ఎకరాలు సేకరించారు. అయితే ఆ నిర్మాణాలు పూర్తి కాకపోవడం, జేఏసీ, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మళ్లీ ఆందోళనలు రావడంతో సీమకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీని అమరావతిలోనే ఉంచి కార్యానిర్వహక రాజధాని వైజాగ్‌లో, న్యాయ రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రకటించారు. అయితే టీడీపీ నేతలు దీనిని అడ్డుకుంటూ వస్తున్నారు. దీనిపై రాయలసీమ జేఏసీ నాయకులు రాయలసీమ గర్జన పేరుతో కర్నూలులో భారీ సభను ఏర్పాటు చేశారు. దీనికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు తెలపడంతో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించి, తగిన సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నారు.  

మరిన్ని వార్తలు