బడిలో టీచర్‌ మందలించాడని రైలు ఎక్కేశాడు

3 Apr, 2021 11:44 IST|Sakshi
భార్య, పిల్లలతో శృంగవృక్షానికి చెందిన శ్రీకాంత్‌ 

పాలకోడేరు: అది 2000 సంవత్సరం.. ఆ పిల్లవాడు 6వ తరగతి చదువుతున్నాడు. బడిలో టీచర్‌ మందలించాడని ఇంటికి వెళ్లకుండా రైల్వేస్టేషన్‌కు వెళ్లి కనిపించిన రైలు ఎక్కేశాడు. హైదరాబాద్‌లో మహానగరంలో దిగి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎక్కడెక్కడో తిరిగాడు. కడుపునింపుకోవడానికి ఎన్నో పనులు చేశాడు. పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. కవలపిల్లలు పుట్టారు. 21 ఏళ్ల అనంతరం అతనికి అమ్మానాన్న, తమ్ముడు, చెల్లి గుర్తుకొచ్చారు. అయితే ఫోన్‌నెంబర్లు లేవు. ఎలా కలవాలో తెలియలేదు. తను పనిచేసే రెస్టారెంట్‌కు రెగ్యులర్‌గా వచ్చే ఒక జర్నలిస్ట్‌కు తన బాధ చెప్పుకున్నాడు. ఆ జర్నలిస్ట్‌ పంచాయతీ కార్యాలయానికి తల్లిదండ్రుల పేర్లు అందించి ఫోన్‌ నెంబర్లు సేకరించాడు. ఇప్పుడు తనవారికి కలుసుకునేందుకు సొంతూరు వస్తున్నాడు.

21 ఏళ్ల క్రితం వెళ్లి పోయిన కొడుకు కోసం తల్లిదండ్రులు వెదకని చోటు లేదు. కాల ప్రవాహంంలో చిన్న కొడుకు, కూతుళ్ల పెళ్లిళ్లు చేశారు. ఎప్పటికైనా కొడుకు వస్తాడని ఎదురుచూస్తున్నారు. వారికి చల్లని వార్త జర్నలిస్ట్‌ రూపంలో అందింది. ఫోన్‌లో కొడుకుతో మాట్లాడారు. సినిమా కథను మరిపించే ఈ సంఘటన పాలకోడేరు మండలం శృంగవృక్షంలో జరిగింది. రావి చెరువు గట్టున ఉన్న బొక్కా సుబ్బారావు–కృష్ణవేణి దంపతుల కుమారుడే శ్రీకాంత్‌. ప్రస్తుతం శ్రీకాంత్‌ తన భార్యా, బిడ్డలతో రెండు దశాబ్దాల అనంతరం సొంత గడ్డపై అడుగుపెడుతున్నాడు. అతని రాక కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తుంది.
చదవండి: యువకుడి హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్‌

మరిన్ని వార్తలు