24 గంటల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు

13 Jun, 2022 05:12 IST|Sakshi

వాతావరణ శాఖ వెల్లడి 

సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు వచ్చే 24 గంటల్లో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం పుణే, బెంగళూరు, పుదుచ్చేరి ప్రాంతాల్లో రుతుపవనాలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. సోమవారానికి రాయలసీమ ప్రాంతంతోపాటు తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ మధ్య–వాయవ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లోకి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని తెలిపింది.

ఆ తర్వాత మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. రుతు పవనాలు విస్తరిస్తున్న క్రమంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 4 నాటికే రుతుపవనాలు రాయలసీమను తాకాల్సి ఉంది.

అయితే పశ్చిమ గాలుల ప్రభావం, ఉపరితల ఆవర్తనం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడంతో ఏపీలోకి విస్తరించడం ఆలస్యమైంది. ప్రస్తుతం పశ్చిమ గాలుల ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలూ తగ్గడంతో రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయని, 24 గంటల్లో రాయలసీమను తాకుతాయని  అధికారులు వివరించారు. 

మరిన్ని వార్తలు