కూలీల కాళ్లు మొక్కిన ఎస్పీ బాలు!

25 Sep, 2020 21:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాన దంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పరమపదించినా పాటగా అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిపోయారు. తను పుట్టిందే గాత్రదానం చేయడానికని ఆయన నిరూపించారు. 50 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు ఆలపించి గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్స్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ప్రపంచం నలుమూలలా ఉన్న అభిమానులు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 

తాజాగా ఓ అభిమాని ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియో బాలు ఇతరులకిచ్చే గౌరవాన్ని, గొప్ప మనసును తెలియజేసిదిగా ఉంది. గతంలో ఓసారి శబరిమలకు వెళ్లిన సమయంలో కొండ ప్రాంతం కావడంతో బాలు ఎక్కువ దూరం నడవలేకపోయారు. దీంతో ఆయన్ను కొందరు కూలీలు డోలీలో ప్రధాన ఆలయం వరకు మోసుకెళ్లారు. అక్కడకు చేరుకోగానే తనను మోసుకొచ్చిన కూలీలకు బాలు కృతజ్ఞతలు తెలిపారు. దాంతోపాటు వారి పాదాలకు నమస్కారం చేశారు. గుడిపాటి చంద్రారెడ్డి అనే యూజర్‌ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 
(చదవండి: ఎస్పీ బాలు పాడిన తొలి, ఆఖ‌రు పాట తెలుసా?)

కాగా, అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. యాభై రోజుల క్రితం కోవిడ్‌ బారినపడ్డ ఆయన.. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ప్రాణాలు విడిచారు. చెన్నైలోని తామరైపాక్కంలో ఉన్న బాలు ఫాంహౌజ్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి.

(చదవండి: జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం)

>
మరిన్ని వార్తలు