క్రాస్‌ ఓటింగ్‌ గుబులు!

3 Dec, 2023 01:57 IST|Sakshi

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో వెంట నడిచిన వారే హ్యాండిచ్చారని సోషల్‌ మీడియాలో పోస్టులు

తాండూరు: జిల్లాలోనే తాండూరు సెగ్మెంట్‌ ఫలితం ఉత్కంఠ భరితంగా మారింది. ఈ ఎన్నికలో అభ్యర్థుల వెంట నడిచిన వారే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శిబిరంలో క్రాస్‌ ఓటింగ్‌ దడ పుట్టిస్తోంది. 2018లో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన పైలెట్‌ ఆ తర్వాత కారెక్కారు. దీంతో అప్పట్లో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా రెండు నెలల క్రితం వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి కేడర్‌ కనిపించలేదు.

అధికార పార్టీ నుంచి పరిగి టికెట్‌ ఆశించిన డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ తరఫున తాండూరు బరిలో నిలిచారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న పాత కాంగ్రెస్‌ నాయకులను, కార్యకర్తలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులను సైతం తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్‌ అయ్యారు. నియోజవర్గంలో బలమైన నేతగా ఎదిగిన రోహిత్‌రెడ్డి ప్రభుత్వ పథకాలతో పాటు తనను నమ్మి నడుస్తున్న వారితో వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.

నేను తాండూరు బిడ్డను నన్ను ఆశీర్వదించండి కష్టసుఖాల్లో మీకు తోడుగా ఉంటానని ఓటర్లను అభ్యర్థించారు. ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్న కొంతమంది నేతలు ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. హస్తం పార్టీలో కొనసాగుతున్న పలువురు కార్యకర్తలు, నాయకులు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయించారనే చర్చ కూడా సాగుతోంది.

ఎమ్మెల్యేలకు ఎర కేసుల బీజేపీ జాతీయ నేతలను ఇరకాటంలో పెట్టారనే ఉద్దేశంతో ఆ పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు, నాయకులు రోహిత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే ప్రచారం కూడా ఉంది. ఇలా జరిగిన క్రాస్‌ ఓటింగ్‌ ఎవరికి అనుకూలిస్తుందో... ఎవరి పుట్టి ముంచుతుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.  

సైలెంట్‌ ఓటింగ్‌.. టఫ్‌ ఫైటింగ్‌ 
తాండూరు రూరల్‌: పోలింగ్‌ పూర్తయింది మొదలు ఓటరు నాడీ పట్టేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. పల్లెల్లో జరిగిన సైలెంట్‌ ఓటింగ్‌ ఎవరికి అనుకూలం.. ఎవరికి ప్రతికూలంగా మారిందనేది అనేది అంతుచిక్కడం లేదు. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్ల పాలన కారుకు కలిసొస్తుందా..? లేక కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపారా అనే చర్చలు సాగుతున్నాయి.
  
ఎవరికి ‘మేజర్‌’ పంచాయతీ 
మండల పరిధిలోని కరన్‌కోట్‌ మేజర్‌ పంచాయతీ. ఇక్కడ దాదాపు 6వేల పైచిలుకు ఓట్లుండగా 4వేల ఓట్లు పోలయ్యాయి. దాదాపు 60శాతం పోలింగ్‌ జరగ్గా కాంగ్రెస్, కారు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్థానికంగా సీసీఐ సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఓటు హక్కును కలిగియున్నారు. ఆ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనేది నాయకులకు అంతుచిక్కడం లేదు.  

మరిన్ని వార్తలు