చర్చలో రభస

18 Mar, 2023 04:21 IST|Sakshi

శాసనసభలో నాలుగో రోజూ టీడీపీ రచ్చ

సంఖ్యాబలం ప్రకారం టీడీపీకి సమయం కేటాయింపు 

ఎక్కువ టైం తీసుకోవడమేగాక వ్యక్తిగత విమర్శలకు దిగిన విపక్షం.. 

అయినా సమయం సరిపోలేదంటూ వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడుతుండగా స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు 

టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

సాక్షి, అమరావతి: బడ్జెట్‌ సమావేశాల సందర్భం­గా నాలుగో రోజూ సభలో రభసను విపక్షం కొనసాగించింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం స్పీకర్‌ తమ్మి­నేని సీతారామ్‌ బడ్జెట్‌పై చర్చ చేపట్టారు. పార్టీ ల సంఖ్యాబలాన్ని అనుసరించి సభ్యులకు సమయం కేటాయిస్తానని సభ ప్రారంభంలోనే ప్రకటించారు. దీని ప్రకారం టీడీపీ సభ్యులకు 17 నిమిషాలు ఇస్తున్నట్లు పేర్కొంటూ చర్చలో తొలుత మాట్లాడే అవకాశం ఇచ్చారు.

టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ బడ్జెట్‌ గణాంకాలు అంకెల గారడీ అని, ప్రభు­త్వం హామీలను విస్మరించిందని చెప్పారు. ఫ్యాన్సీ నెంబర్‌పై 2,79,279పై ఉన్న దృష్టి ప్రజా సమస్యలపై లేదంటూ బడ్జెట్‌ను విమర్శించారు. ఈ సమయంలో సీఎం ఆస్తులంటూ ఆరోపణలు చేస్తుండడంతో అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అప్పటికే నిర్ణీత సమయం మించిపోవడం, వ్యక్తిగత విమర్శలు కొనసాగించడంతో ప్రసంగాన్ని త్వరగా ముగించాలని స్పీకర్‌ సూచించారు.

బడ్జెట్‌పై చర్చించకుండా తప్పుదోవ పట్టించే యత్నాలు సరికాదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సూచించారు. అప్పటికే టీడీపీకి ఇచ్చిన నిర్ణీత సమయం దాటిపోయి 25 నిమిషాలు మాట్లాడడంతో అధికార పార్టీ నుంచి చర్చలో పాల్గొనేందుకు కోన రఘుపతికి స్పీకర్‌ అవకాశమిచ్చారు. ఈ సమయంలో టీ­డీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరు­కుని తమకు సమయం సరిపోలేదంటూ నినాదాలు చేస్తూ చర్చకు ఆటంకం కల్పించా­రు. డోల బాలవీరాంజనేయులు, వెలగపూడి రా­­మకృష్ణ, ఆదిరెడ్డి భవానీ తదితరులు సభాపతి కుర్చీ వద్దకు చేరుకుని స్పీకర్‌ డౌన్‌డౌన్‌... అంటూ నినాదాలు చేశారు.

విపక్ష సభ్యులు తమ సీట్ల వద్దకు వెళ్లాలని స్పీకర్‌ పదేపదే కోరినా మైక్‌ ఇవ్వాలని పట్టుబట్టారు. భోజనం సమయం కావడంతో టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండై బయటకు వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. అనంతరం సభ ఆమోదంతో టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించడంతో నినాదాలు చేస్తూ నిష్క్రమించారు.  

మరిన్ని వార్తలు