మోకా.. ‘చిరు’ చిత్రాలు కేక!

17 Sep, 2023 04:45 IST|Sakshi

జీ–20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా విశాఖ చిత్రకారుడి చిరుధాన్యాల చిత్రాలు

ఏయూక్యాంపస్‌ (విశాఖ తూర్పు): విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్‌ తీర్చిదిద్ధిన చిరుధాన్యాల చిత్రాలు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రధానుల సతీమణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో భాగంగా ప్రగతి మైదానంలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. మోకా విజయ్‌కుమార్‌ చిరుధాన్యాలతో తీర్చిదిద్ధిన భారతీయ రైతుల చిత్రాలు, వినాయకుడి ప్రతిమను  ఉంచారు. ఆయన రెండు అడుగుల ఎత్తుతో తయారు చేసిన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గణపతి విగ్రహాన్ని ఎగ్జిబిషన్‌ ప్రారంభ ప్రదేశంలోనే ప్రదర్శనకు ఉంచడం విశేషం.

విజయ్‌కుమార్‌ మిల్లెట్స్‌తో తయారు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ చేతుల మీదుగా ఆమెకు ప్రదానం చేశారు. భారతీయ రైతుల కష్టాన్ని ప్రతిబింబిస్తూ మిల్లెట్స్‌పై ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా తాను ఈ చిత్రాలను తయారు చేసినట్లు విజయ్‌కుమార్‌ తెలిపారు. గతంలో విశాఖపట్నం, హైదరాబాద్‌లలో జరిగిన జీ–20 సదస్సుల్లో కూడా తన చిత్రాలను ప్రదర్శించినట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు