శేషాచలం.. నల్లమల.. అడవి ఏదైనా జల్లెడ పట్టడమే వారి విధి

27 Oct, 2022 20:22 IST|Sakshi

ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టే లక్ష్యంగా అడవిలో పోలీసులు

విధి నిర్వహణలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న వైనం

స్పెషల్‌ పార్టీ కూంబింగ్‌ బృందంపై ప్రత్యేక కథనం 

సాక్షి, రాయచోటి: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు అడవిబాట పడుతున్నారు. ఇంతకుమునుపు మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో అనునిత్యం అరణ్యంలో గడుపుతూ వచ్చారు. అయితే కాలక్రమేణా మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడం.. ఎర్రచందనం స్మగ్లర్ల బెడద పెరిగిపోవడంతో వారిని ఎదుర్కొనేందుకు ఖాకీలు శ్రమిస్తున్నారు. ఒక వైపు స్మగ్లర్లు, మరోవైపు ఎర్రచందనం కూలీల చర్యలు తిప్పికొట్టేందుకు అడవిలోనే మకాం వేస్తున్నారు. అడవిలో అనేక రకాల సవాళ్లు.. కష్టాలు ఎదురవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఇష్టంగా ముందుకు వెళుతున్నారు. ఒక్కరోజులో పదుల సంఖ్యలో కొండలు, గుట్టలు..వాగులు, వంకలు దాటుకుంటూ ఎర్రచందనం చెట్ల రక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. సుమారు 20 మందితో కూడిన కూంబింగ్‌ దళం ప్రతినెల మూడు వారాలపాటు అడవిలోనే తిరుగుతోంది. 

అరణ్యంలో కిలోమీటర్ల మేర నడక 
అన్నమయ్య జిల్లాలో నల్లమలతోపాటు ఎర్రమల, శేషాచలంతోపాటు ఇతర పలు రకాల అడవులు విస్తరించాయి. ప్రధానంగా ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్న కొండల్లోకి బృందం అడుగు పెట్టిందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నడకే సాగుతుంది. ఆహారం తీసుకునే సమయం మినహా మిగతా సమయంలో అడవినంతా జల్లెడ పడతారు. తెల్లవారుజామున 4 గంటలకే లేవడం, ఒక ప్రాంతంలో టిఫెన్‌ చేసుకుని ఉదయాన్నే 6 గంటలకు అలవాటు ఉన్న వారు తినడం, లేని వారు పార్సిల్‌ కట్టుకుని నడక మొదలు పెడతారు. అక్కడి నుంచి అటవీశాఖ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపడతారు.


నడిచే సమయంలో మాట్లాడకుండా, సెల్‌ఫోన్లు చూడకుండా తుపాకీ భుజాన పెట్టుకుని కూంబింగ్‌లో భాగంగా వేట కొనసాగుతుంది. అలా మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం వరకు తిరగడం, రాత్రికి సమీప ప్రాంతంలోనే టెంటు వేసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అందులోనూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కాకుండా బయట ప్రాంతాలను ఎంచుకుంటారు. అడవిలో నీరు నిల్వ ప్రాంతాలకు జంతువులు వచ్చే అవకాశం ఉండడంతో కూంబింగ్‌ దళం సమీప ప్రాంతాల్లో ఎక్కడా టెంట్లు వేసుకోరు. 

దుంగలు దొరికితే ‘అడవంత కష్టం’ 
అడవిలో కొండలు, రాళ్లు, చెట్ల పొదలను దాటుకుని నడవడమే కష్టం. అలాంటిది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసుకున్న దుంగలు కూడా ఒక్కోసారి కనబడతాయి. ఈ తరుణంలో వాటిని అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకు రావాలన్నా...అడవిలో మోయాలన్నా అడవంత కష్టముంటుంది. ఎందుకంటే ఒకవైపు బ్యాగు, మరోవైపు తుపాకీ, ఇంకోవైపు ఎర్రచందనం దుంగలను ఎత్తుకుని కాలిబాటగా రావాల్సిందే. కనీసం బయటికి సమాచారం ఇవ్వడానికి సెల్‌ఫోన్లు పనిచేయవు.. సిగ్నల్స్‌ ఉండవు. కేవలం భుజానికి ఎత్తుకుని కిలోమీటర్ల మేర నడవడమే మార్గం. 


అనుక్షణం అప్రమత్తం 

అడవిబాట పట్టిన పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీరు నిల్వ ఉన్నచోట, మధ్యాహ్న సమయంలో స్వయంగా ఈ బృందమే వంట సిద్ధం చేసుకుని తిని వెళతారు. అయితే ఒకవైపు స్మగ్లర్లు, ఎర్రచందనం కూలీలతో ముప్పు పొంచి ఉంటుంది. మరోవైపు అడవి జంతువులతోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో ప్రధానంగా విష సర్పాలు, పురుగులతో సహవాసం తప్పదు. రాత్రి సమయంలో సెల్‌ఫోన్ల లైటింగ్‌ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.  

రాత్రి పూట ఒక సెంట్రీ 
అడవిలో కూంబింగ్‌ నిర్వహణకు వెళ్లిన పోలీసులు నిద్రపోయే సమయంలో కూడా ఒక సెంట్రీ పహారా కాస్తారు. రాత్రంతా రెండు గంటలకు ఒకరు చొప్పున మారుతూ డ్యూటీలు చేస్తారు. పగలంతా నడక చేసినా రాత్రి పూట కూడా వారందరికీ రక్షణగా ఒకరు మేలుకుని విధులు నిర్వర్తిస్తారు. ఎందుకంటే రాత్రిపూట స్మగ్లర్లు, కూలీలు, అడవి జంతువుల దాడుల నేపథ్యంలో కచ్చితంగా ఒక పోలీసు నిద్ర మేల్కొని  సెంట్రీ డ్యూటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది.  

జోరు వానలో.. ఎముకలు కొరికే చలిలో..   
కూంబింగ్‌ దళానికి సంబంధించి ఒక ఆర్‌ఎస్‌ఐతోపాటు ఒక లోకల్‌ ఎస్‌ఐ, పది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు అటవీశాఖ సిబ్బందితో కలిసి అడవిలోకి వెళితే వర్షం వణికిస్తున్నా.. చలి చంపేస్తున్నా.. మంచు కమ్మేస్తున్నా.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవమే లక్ష్యంగా అడుగు మాత్రం ముందుకు పడాల్సిందే. ఒక్కోసారి అడవిలోకి బృందం వెళ్లిందంటే మూడు రాత్రులతోపాటు నాలుగు పగళ్లు అక్కడే ఉండి ఇంటికి చేరుకుంటారు. జిల్లా కేంద్రం నుంచి చుట్టు పక్కల అటవీ ప్రాంతం సమీపం వరకు వాహనం వదిలి వస్తుంది. నాలుగు రోజుల తర్వాత అడవి నుంచి బయటికి రాగానే మళ్లీ వాహనం వెళ్లి తీసుకు వస్తుంది. 

ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకే కూంబింగ్‌ 
అన్నమయ్య జిల్లాలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. అయితే కొంతమంది స్మగ్లర్లు, తమిళ కూలీలు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో కఠినంగా ముందుకు వెళుతున్నాం.         
– వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ, అన్నమయ్య జిల్లా 

రోజుకు 40 కిలోమీటర్ల మేర నడక 
అడవిలోకి కూంబింగ్‌ వెళ్లిన దళం ఉదయం 6 గంటలకు నడక మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు సాగుతూనే ఉంటుంది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అడవిలో నడుస్తూనే ఉంటాం. ఒకరినొకరు మాట్లాడుకోకుండా గ్రూపులుగా అడవి అంతా జల్లెడ పడతాం. అడవినంతా గాలిస్తూ ముందుకు వెళతాం.  ఎక్కువ యుక్త వయస్సు వారే ఉంటుండడంతో ఎక్కువ కిలోమీటర్లు నడవగలగడంతోపాటు వంట కూడా మేమే చేసుకుంటాం.   
– తులసిరామ్,  కానిస్టేబుల్, రాయచోటి 

అక్రమ రవాణాను అడ్డుకోవడమే సవాలుగా తీసుకుని.. 
అడవిలోకి వెళుతున్నామంటే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళతాం. ఎలాంటి సవాళ్లు ఎదురైనా కూడా భయపడం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురైనా వారిని అదుపులోకి తీసుకునేందుకు అడవినంతా గాలిస్తాం. అడవిలో ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఉన్నా అడుగు మాత్రం వెనక్కి పడదు.      
– రెడ్డిశేఖర్, కానిస్టేబుల్, రాయచోటి

మరిన్ని వార్తలు