‘రెవెన్యూ’ భాష!

23 Nov, 2020 21:43 IST|Sakshi

రాజుల కాలంలోనే రూపకల్పన

బ్రిటిషర్ల హయాంలో కొత్తరూపు

అర్థం తెలియకపోయినా.. వాడుకలో పదాలు

సాక్షి, అమరావతి: భూ రికార్డులు, సర్వే సెటిల్‌మెంట్‌ రికార్డుల్లో ప్రత్యేక పదాలను వాడుతున్న విషయం మనకు తెలిసిందే. స్థిరాస్తి క్రయ, విక్రయ దస్తావేజుల్లోనూ ఈ పదాలే రాస్తారు. అందుకే దీన్ని రెవెన్యూ పదజాలం అంటారు. రాజుల కాలంలోనే రెవెన్యూకు ప్రత్యేక పదజాలం రూపుదిద్దుకుంది. తర్వాత బ్రిటిషర్ల కాలంలో ఆంగ్ల పదాలు చేరాయి. చాలామందికి అర్థాలు తెలియకపోయినా ఈ పదాలను వాడుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ముఖ్యమైన రెవెన్యూ పదాల గురించి తెలుసుకుందాం.

రాజుల కాలం నుంచీ రాజ్యానికి ప్రధాన ఆదాయవనరు భూమిశిస్తు. అందువల్లే రెవెన్యూ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఉండేది. తర్వాత కాలంలో భూమిశిస్తు ఆదాయం నామమాత్రంగా మారింది. కాలక్రమంలో మన రాష్ట్రంలో ప్రభుత్వం భూమిశిస్తునే రద్దుచేసింది. 

అసైన్డ్‌ భూమి: నాడు భూమిపై హక్కు రాజ్యానిదే. వంశపారంపర్యంగా పంటలు పండించుకోవడానికే రైతులకు హక్కుండేది. అందుకే ప్రభుత్వం భూమిశిస్తు వసూలు చేసేది. భూమిలేని వారికి వ్యవసాయానికి, ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా భూమి పట్టా ఇచ్చేది. దీన్నే అసైన్డ్‌ భూమి అని, దరఖాస్తు పట్టా (డీకేటీ) అని అంటారు. ఈ భూమిపై పట్టాదారులకు వంశపారంపర్యంగా అనుభవహక్కులు మాత్రమే ఉంటాయి. ఇతరులకు విక్రయించడం, బదలాయించడం నిషేధం. 

ఎఫ్‌ఎంబీ: సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం వివరాలున్న పుస్తకాన్ని ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌ (ఎఫ్‌ఎంబీ) అంటారు. గ్రామంలోని సర్వే నంబర్లు, ఎంత భూమి ఉందనే వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు. 

గ్రామపటం: గ్రామంలోని మొత్తం భూమికి సంబంధించిన మ్యాపునే గ్రామపటం అంటారు. దీన్లో ఆ గ్రామంలోని సర్వే నంబర్ల వారీగా భూమి ఆకారాలతో స్కేల్‌ మ్యాపు ఉంటుంది. 

అడంగల్‌: దీన్నే భూ అనుభవ పుస్తకం అంటారు. ఏయే సర్వే నంబర్లలో ఎవరెవరి అనుభవంలో ఎంతెంత భూమి ఉందనే సమాచారం ఇందులో ఉంటుంది. ప్రభుత్వ, దేవదాయ భూముల వివరాలు కూడా దీన్లోనే ఉంటాయి. 

ఆర్‌వోఆర్‌: దీన్నే భూ యాజమాన్య హక్కుల పుస్తకం అంటారు. ఆర్‌వోఆర్‌నే- 1బి అని కూడా అంటారు. గతంలో దీన్నే టెన్‌వన్‌ అడంగల్‌ అనే వారు. ఎవరెవరికి ఎంతెంత భూమి ఏవిధంగా సంక్రమించిందనే సమాచారం ఇందులో ఉంటుంది.

ఆర్‌ఎస్‌ఆర్‌: దీన్నే రీసర్వే రిజిస్టర్‌ అంటారు. సర్వే నంబర్ల వారీగా భూమి విస్తీర్ణం, హక్కుదారుల వివరాలతో దీన్ని తయారు చేశారు. ఇది రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది.

గ్రామకంఠం: గ్రామ అవసరాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన భూమినే గ్రామకంఠం అంటారు. ఈ భూములపై గ్రామ పంచాయతీకే హక్కు ఉంటుంది. 

సర్కారు పుంజి: ప్రభుత్వ భూమి

చుక్కలభూమి: దీన్నే డాటెడ్‌ ల్యాండ్‌ అంటారు. ఖాళీగా ఉన్న బంజరు భూమికి భూమిశిస్తు చెల్లించలేక కొందరు ఈ భూములను తమవని క్లెయిమ్‌ చేసుకోలేదు. దీంతో అప్పటి అధికారులు దీనిపై అనుభవదారులు హక్కులు కోరినప్పుడు వారి పేర్లు నమోదు చేద్దామనే ఉద్దేశంతో ఆ భూముల ఎదుట చుక్కలు పెట్టి వదిలేశారు. 

జమాబందీ: ఇది భూమిశిస్తు వసూలుతోపాటు రికార్డులు అప్‌డేట్‌ చేసే కార్యక్రమం. రెవెన్యూ ఆడిటింగ్‌ లాంటిది. 

ఫసలీ: జూలై ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు 12 నెలల కాలాన్ని ఫసలీ అంటారు. ఆ సంవత్సరంలో వచ్చిన రెవెన్యూను ఫసలీగా లెక్కగడతారు. మన రాష్ట్రంలో భూమిశిస్తు రద్దు అయినందున జమాబందీ, ఫసలీ పదాలు ఇప్పుడు వాడుకలో లేవు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా