దుర్గ గుడి, శ్రీశైలంలో అభివృద్ధి పనులకు ఈ నెలలో సీఎం శంకుస్థాపన

6 Sep, 2023 06:22 IST|Sakshi

విజయవాడ దుర్గ గుడి వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం దాదాపు రూ.225 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఈ నెలలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి సత్యనారాయణ వెల్లడించారు. శ్రీశైలం ఆలయం వద్ద మరో రూ.175 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. దుర్గ గుడి వద్ద ప్రసాదం పోటు, అన్నదానం భవనం, శివాలయం నిర్మాణ పనులు, రాక్‌ మిటిగేషన్‌ (కొండ చరియలు విరిగిపడకుండా), ఆటోమేషన్‌ పార్కింగ్‌ వసతి తదితర పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు.

ఇప్పుడున్న ఘాట్‌ రోడ్డు వాస్తుపరంగా  అంత శుభప్రదం కాదని వాస్తు పండితులు పేర్కొంటున్నందున రాజగోపురం నుంచి భక్తులు వచ్చి వెళ్లేలా దుర్గానగర్‌లో ఎలివేటెడ్‌ క్యూలైన్‌ (ప్లై ఓవర్‌), క్యూ కాంపెక్స్‌ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆలయాల పక్కన రెండు అంతస్తులతో పూజా మండపాలు కడుతున్నామన్నారు. ఇక శ్రీశైలం ఆలయం వద్ద రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.40 కోట్లతో సాల మండపాల నిర్మాణంతో పాటు ఇటీవల అటవీ శాఖ నుంచి ఆలయం స్వాదీనంలోకి వచ్చిన 4,600 ఎకరాలకు ఫెన్సింగ్‌ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలి­పారు. అక్టోబరు నుంచి ధర్మ ప్రచార కార్య­క్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. 

మరిన్ని వార్తలు