పొదుపు మహిళే బ్యాంకర్‌! సంఘాలే బ్యాంకులు

29 Oct, 2023 03:54 IST|Sakshi

ప్రభుత్వ చర్యలతో అంతర్గత రుణ వ్యవస్థ బలోపేతం

కొత్త పుంతలు తొక్కుతున్న గ్రామీణ ఆర్థికాభివృద్ధి

3 నెలల్లో ఏకంగా రూ.2,107 కోట్ల అంతర్గత లావాదేవీలు 

రూ.866 కోట్ల కొత్త రుణాలు.. రూ.1,241 కోట్లు వసూలు

గ్రామాల్లో పొదుపు సంఘాల పేరిట రూ.11,291 కోట్లు.. సగటున ప్రతి నెలా అదనంగా రూ.126 కోట్లు పెరుగుదల

ఇన్నాళ్లూ ఈ డబ్బంతా పావలా లోపు వడ్డీ వచ్చే సేవింగ్‌ ఖాతాలకే పరిమితం

సీఎం జగన్‌ సూచన మేరకు నిబంధనలు మార్చిన బ్యాంకర్లు

రూపాయిలోపు వడ్డీతో సభ్యులు ఈ డబ్బును అప్పుగా తీసుకునే అవకాశం

ఆ వడ్డీ డబ్బులు సంఘ నిధిలో చేరి.. సభ్యులందరికీ వాటా

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల్లో మినీ బ్యాంకు తరహాలో కార్యకలాపాలు

పొదుపు మహిళలు అప్పుల కోసం ఇక్కట్లు పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం 

పేదింటి మహిళలు పది మంది చొప్పున కలిసి స్వయం సహాయక పొదుపు సంఘాలుగా ఏర్పడటం మననందరికీ తెలుసు. ఈ సంఘాలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని.. వ్యాపార, కుటుంబ అవసరాలకు వినియోగించుకోవడమూ తెలిసిందే.  అయితే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ సంఘాలు ఇంకో అడుగు ముందుకు వేశాయి. ప్రతి నెలా పోగేసుకున్న సొమ్ముతో స్వయంగా రుణాలిచ్చే దశకు ఎదిగాయి. తద్వారా అంతర్గత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ పరిణామం రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక కార్యకలా­పాల వేగాన్ని సూచిస్తోంది. ఇంత వేగంగా గ్రామీణ ఆర్థికాభివృద్ధి ఒక్క మన రాష్ట్రంలోనే కనిపిస్తోంది.

సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదన­పల్లి మండలం బసినకొండ గ్రామంలో 18–19 ఏళ్ల క్రితం తొమ్మిది మంది మహి­ళలతో రాజరాజేశ్వరి స్వయం సహాయక పొదుపు సంఘం ఏర్పాటైంది. మొదట్లో ఒక్కొక్కరు నెలకు రూ.50 చొప్పున పొదుపు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ప్రతి నెలా రూ.500 చొప్పున దాచుకుంటు­న్నారు. ఇలా జమ చేసుకున్న సొమ్ము రూ.ఆరున్నర లక్షలకు చేరుకుంది. ఈ డబ్బు­లను అవసరమైన వారికి నామ­మాత్రపు వడ్డీకి అప్పుగా ఇవ్వాలని ఈ సంఘం సభ్యులందరూ నిర్ణయించుకున్నారు.

దీంతో ఈ సంఘంలో సభ్యులైన నలుగురు మహిళలు ఆరు నెలల క్రితం రూపాయి­లోపు వడ్డీతో రూ.ఆరు లక్షలు రుణంగా తీసుకున్నారు. అప్పటి వరకు ఈ సొమ్ము పావలా వడ్డీ కూడా రాని బ్యాంకు సేవింగ్‌ ఖాతాకే పరిమితమై ఉండింది. ఈ సంఘం నిర్ణయం వల్ల ఇప్పుడు రూపాయి లోపు వడ్డీ వస్తోంది. వడ్డీ రూపంలో వచ్చే మొత్తం తిరిగి సంఘ నిధికే జమ అవుతుంది. సంఘం ఉమ్మడి నిధిలో జమ అయ్యే ఈ సొమ్ములో సభ్యులందరికీ వాటా ఉండటం వల్ల అప్పు తీసుకున్న సభ్యులకు మరింత ఉపశమనం కలుగుతోంది.

ఈ విధానం వల్ల అందరం సంతోషంగా ఉన్నామని ఈ సంఘం లీడర్‌ సీహెచ్‌ లక్ష్మీకాంతం తెలిపారు. పి.అరుణ అనే సంఘ సభ్యురాలికి ప్రభు­త్వం ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణా­నికి సైతం ఆర్థిక సహాయం మంజూరు చేయగా, అనుకున్న విధంగా ఇల్లు అందంగా కట్టుకునేందుకు అదనంగా రూ.1.65 లక్షలు సంఘమే ఆమెకు అప్పుగా ఇచ్చిందని చెప్పారు. ఇంకొక సభ్యురాలికి ఇంటి నిర్మాణం కోసం రూ.1.65 లక్షలు, మరొ­కరికి కొత్త వ్యాపార దుకాణం ఏర్పాటుకు రూ.రెండు లక్షలు, ఇంకొకరికి కుటుంబ అవసరాల కోసం రూ.70 వేల రుణం అందజేశామని ఆమె వివరించారు.

సంఘ సభ్యులలో ఎవ్వరికీ డబ్బులు అవసరం లేని పక్షంలో తమ చుట్టపక్కల ఉండే తెలిసిన వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇదే గ్రామంలోని కల్యాణ స్వయం సహాయక సంఘం సైతం ఇదే రీతిలో ఆర్థిక లావాదేవీలు సాగిస్తోంది. ఈ సంఘం వద్ద రూ.ఏడు లక్షల పొదుపు నిధి ఉండగా.. ఐదు నెలల క్రితం ఇద్దరికి, ఈ నెలలో మరో ఇద్దరు తమ సంఘ సభ్యులకే మొత్తం రూ.నాలుగు లక్షలు రుణంగా ఇచ్చామని సంఘం లీడర్‌ పద్మావతి తెలిపారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పొదుపు సంఘాలు మినీ బ్యాంకుల తరహాలో లావాదేవీలు సాగిస్తుండటం విశేషం. 

అంతర్గత రుణ వ్యవస్థ బలోపేతం
రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో పేదింటి మహిళల్లో ఆర్థిక భద్రత తొణికిసలాడుతోంది. లక్షల సంఖ్యలో ఉన్న పొదుపు సంఘాలు ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.రెండు మూడు లక్షల చొప్పున అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాయి. ఒకపక్క ఈ సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను సద్వినియోగం చేసుకుంటూనే, మరోపక్క వేరుగా పెద్ద మొత్తంలో అంతర్గత రుణ వ్యవస్థను పెంపొందించుకున్నాయి.

ప్రభుత్వం కల్పించే ప్రోత్సాహంతో ఏడాదిన్నరగా అంతర్గతంగా మినీ బ్యాంకుల తరహా రుణ లావాదేవీలు సాగిస్తుండటం ఆహ్వానించదగిన పరిణామ­మని ఆర్థిక రంగ నిపుణులు ప్రశంసిస్తు­న్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 8,45,374 స్వయం సహాయక పొదుపు సంఘాలు ఉండగా.. కేవలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో 4.39 లక్షల సంఘాలు తమ సంఘ పొదుపు నిధి నుంచి రూ.866 కోట్లు అంతర్గతంగా రుణాలు ఇచ్చాయి. ఆగస్టులో 1,55,778 పొదుపు సంఘాలు రూ.297 కోట్లు, సెప్టెంబర్‌లో 1,21,672 సంఘాలు రూ.204 కోట్లు, అక్టోబర్‌లో 1,62,259 సంఘాలు రూ.365 కోట్లు రుణంగా ఇచ్చాయి.

3 నెలల్లో రూ.1,241 కోట్లు వసూలు
మరోవైపు.. స్వయం సహాయక పొదుపు సంఘాలు అంతర్గత రుణాల రూపంలో ఇచ్చే రుణాలను నెల వారీ కిస్తీ రూపంలో లేదా ఒకే విడత చెల్లింపునకు వీలుగా అవకాశం కల్పిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాలు గతంలో అంతర్గత రుణాల రూపంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి గత మూడు నెలల్లో ఏకంగా రూ.1,241 కోట్లు (అసలు, వడ్డీ కలిపి) జమ కావడం గమనార్హం.

గతంలో సంఘం నుంచి అంతర్గత రుణాలు పొందిన మహిళలు ఆగస్టులో రూ.493 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.386 కోట్లు, అక్టోబర్‌లో రూ.362 కోట్లు చెల్లించారు. మొత్తంగా గత మూడు నెలల్లో బ్యాంకులకు ఏ మాత్రం సంబంధం లేకుండా పేద మహిళలు ఏర్పాటు చేసుకున్న ఆయా పొదుపు సంఘాలలో  ఏకంగా రూ.2,107 కోట్ల మేర అంతర్గత రుణ లావాదేవీలు కొనసాగడం ఈ వ్యవ­స్థలో కొత్తగా చోటు చేసుకున్న పరిణామం. ఇది మరిన్ని సంస్కరణలకు నాంది అని అధికారులు పేర్కొంటున్నారు.

రూ.11,291 కోట్లకు పైగా పొదుపు నిధి
గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.45 లక్షల స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల పేరిట పొదుపు నిధి రూపంలో ఏకంగా రూ. 11,291 కోట్ల మేర డబ్బులు ఉన్నాయి. ఇప్పటి­దాకా పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణ మొత్తంలో నాలుగో వంతుకు పైబడి ఆయా సంఘాల పొదుపు డబ్బులు కేవలం ఆయా సంఘాల సేవింగ్‌ ఖాతాలలో నిరు­పయోగంగా ఉండేవని అధికా­రులు చెబుతున్నారు. పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు సగటున ఒక్కొక్కరు ప్రతి నెలా రూ.200 చొప్పున దాచుకుంటుంటా­రు.

గ్రామీణ ప్రాంతంలో ఈ మొత్తం ప్రతి నెలా రూ. 110 కోట్ల నుంచి రూ.130 కోట్ల మధ్య ఉంటోంది. అక్టో­బర్‌లో రూ.126 కోట్లు ఇలా పొదుపు చేశారు. ఇలా దాచుకున్న డబ్బులు కేవలం పావలా వడ్డీ చొప్పున కూడా రాని బ్యాంకు సేవింగ్‌ ఖాతాల్లో ఉండిపో­వాల్సిన పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. ఇలా ఉండి­పోయిన రూ. 11,291 కోట్ల మొత్తాన్ని రూపాయి దాకా వడ్డీ వచ్చేలా అంతర్గత రుణాలు రూపంలో వినియోగించుకునేలా ప్రభుత్వం మహిళలను ప్రొత్సహిస్తోంది. ఆర్థిక కార్యకలా­పాల్లో కీలక అంశమైన దీనిపై పొదుపు సంఘాల మహిళలకు శిక్షణా కార్య­క్రమాలు నిర్వహిస్తోంది.

తద్వారా మహి­ళలు ప్రతి నెలా పొదుపు రూపంలో దాచుకునే డబ్బు­లతో అంతర్గత రుణాలు ఇచ్చే వెసు­లుబాటు ఇవ్వడం వల్ల మొత్తం సంఘాల పొదుపు నిధి భారీగా పెరు­గుతుంది. ఇది  భవి­ష్యత్‌లో ఆయా సంఘాల్లోని మహిళలు రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లా­ల్సిన అవసరం లేకుండా ఆదుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సం­ఘాల్లోని సభ్యులు అవసరమైన మేర రుణాలు తీసుకునే స్థాయికి పొదుపు సంఘాల వ్యవస్థను బలో­పేతం చేయడం ప్రభుత్వ ఉద్దేశం.

పొదుపు నిధిలో 80–90 శాతం వినియోగం
పొదుపు సంఘాల మహిళలు నెలనెలా దాచుకున్న డబ్బులు పెద్ద మొత్తంలో బ్యాంకుల్లో ఉంచుకొని కూడా అవసరాలకు అదే బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకోవడం ద్వారా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇది గుర్తించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మహిళా సంఘాల పొదుపు డబ్బులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా వాళ్ల అవసరాలకు ఉపయోగించుకునేలా వీలు కల్పించాలని ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో బ్యాంకర్లకు సూచించారు. ఉదాహరణకు ఒక పొదుపు సంఘం పేరిట రూ.రెండు లక్షల దాకా పొదుపు నిధి ఉండీ కూడా.. ఆ సంఘ సభ్యులు రూ.పది లక్షలు అవసరం ఉంటే రూ.పది లక్షలు అప్పుగా తీసుకునే బదులు, తమ పొదుపు డబ్బుల్లో రూ.లక్షన్నర వినియోగించుకొని, మిగిలిన రూ.8.50 లక్షలు అప్పుగా తీసుకోవచ్చు.

తద్వారా ఆ మహిళలందరికీ ప్రయోజనం ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పొదుపు సంఘాల మహిళలు తాము పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులతో మొదట అంతర్గతంగా రుణాలు తీసుకుంటే, మిగిలిన మొత్తం బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేలా సెర్ప్‌ ద్వారా మహిళలను ప్రొత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నాం. పొదుపు సంఘాల పేరిట ఉండే మొత్తం పొదుపు నిధి రూ.11,291 కోట్లలో 80–90 శాతం నిధులను సంఘాల అంతర్గత రుణ వ్యవస్థలో వినియోగంలోకి తేచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సెర్ప్‌ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంపై నిరంతరం జిల్లాలతో సమీక్షిస్తున్నాం.
– ఏఎండీ ఇంతియాజ్, సెర్ప్‌ సీఈవో 

మరిన్ని వార్తలు