ఏపీ ప్రభుత్వానికి సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌

14 Sep, 2020 13:16 IST|Sakshi

ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

సాక్షి, న్యూఢిల్లీ : పదిమంది కరోనా బాధితుల మృతికి కారణమైన విజయవాడ రమేష్‌ ఆస్పత్రిపై చర్యలు తీసుకునేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. స్వర్ణ ప్యాలెస్‌ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రమాద కారకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ నారీమన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తుపై ఏకపక్షంగా నిషేధం విధించడం సరికాదన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది కరోనా పేషెంట్లు చనిపోయారని వివరించారు. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. (తప్పంతా రమేష్‌ ఆస్పత్రిదే)

దర్యాప్తు సాగే విధంగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని న్యాయవాది వాదించారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డాక్టర్ రమేష్ కేసులో విచారణ జరపొచ్చుని తెలిపింది. దర్యాప్తునకు డా.రమేష్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. అయితే రమేష్‌ అరెస్ట్‌పై సాక్ష్యాల ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చిన ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయనకు, మరో డైరెక్టర్ సీతా రామ్మోహన్ రావులను అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ గత గురువారం ఏపీ సర్కార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా సుప్రీంకోర్టు నిర్ణయంతో ఏపీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. దోషులను కోర్టు నిలబెట్టే విధంగా విచారణ జరుపనున్నారు.

మరిన్ని వార్తలు