హైందవ ధర్మ సంరక్షణే ధ్యేయం  

9 Nov, 2021 04:16 IST|Sakshi
స్వామీజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు తీసుకుంటున్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, శ్రీరంగనాథరాజు

శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి 

ఘనంగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు

పెందుర్తి: వేద పరిరక్షణ, హైందవ ధర్మ రక్షణే ధ్యేయంగా శ్రీ శారదాపీఠం ముందుకు సాగుతోందని పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చెప్పారు. పీఠం ఇంత గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందంటే పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ధర్మ మార్గమే కారణమని తెలిపారు. ఆదిశంకరుడి అడుగుజాడలే తమకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు. విశాఖ జిల్లా చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీగా నాగుల చవితి పర్వదినం రోజున జరిగే ఈ వేడుకల్లో భాగంగా స్వామీజీ చేతుల మీదుగా పీఠ ఆస్థాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, సుబ్రహ్మణ్యస్వామి, దాసాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా స్వామీజీకి కూపి స్నపనం, వేద మంత్రోచ్ఛారణల నడుమ పాదపూజ చేశారు. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి జరిపారు.

ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ భారతదేశపు మూలాల నుంచి అద్వైత సిద్ధాంతాన్ని వెలికి తీసింది ఆదిశంకరాచార్యులేనని.. ఆయన ఆలోచనలు తలచుకుంటూ పురుడుపోసుకున్నదే విశాఖ శ్రీ శారదా పీఠమన్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వామీజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వాణీమోహన్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మార్గాని భరత్, ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్‌నాథ్, చెట్టి పాల్గుణ, కారుమూరి నాగేశ్వరరావు, వెంకట చిన్నఅప్పలనాయుడు, తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్‌ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.     

మరిన్ని వార్తలు