ఆగమ సలహా మండలి ఏర్పాటు చేయాలి

5 Sep, 2021 05:22 IST|Sakshi
స్వరూపానందేంద్ర ఆశీస్సులు పొందుతున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌

మంత్రి వెలంపల్లికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచన

పెందుర్తి: దేవదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యమయ్యేలా ఆగమ సలహా మండలిని ఏర్పాటు చేయాలని, ఆ సలహా మండలి సూచనలతో ఆలయాల నిర్వహణలో మార్పులు చేపట్టాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. రుషికేష్‌లో విశాఖ శ్రీ శారదా పీఠం ఆశ్రమంలో చాతుర్మాస దీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని మంత్రి వెలంపల్లి శనివారం కలిశారు. మంత్రితో స్వరూపానంద మాట్లాడుతూ..మారుమూల ప్రాంతాల్లోని ఆలయాలను కేంద్రంగా చేసుకుని హిందూ ధర్మ ప్రచారం చేపట్టాలని సూచించారు.

అన్యాక్రాంతం అవుతోన్న ఆలయాల భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల అభివృద్ధికి కేంద్రంతో చర్చించాలన్నారు. చాతుర్మాస దీక్ష అనంతరం పంచారామ క్షేత్రాలపై విశాఖ శ్రీ శారదాపీఠం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సీతారామపురం ఆలయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం మంత్రి వెలంపల్లి రిషికేష్‌లోని గంగానదిలో స్నానం ఆచరించారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, చంద్రమౌళీశ్వరుల పీఠార్చనకు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు