టీడీపీ సర్కార్‌ నిర్వాకాలు: షి‘కారు’ వెనుక డీలర్లతో డీల్‌!

7 Sep, 2022 05:07 IST|Sakshi

ఎస్సీలకు ఉపాధి పేరుతో టీడీపీ సర్కారు నిర్వాకాలుఎస్సీ కార్పొరేషన్‌ నిధులు పరాయి పాలు

ముందుగానే రూ.365.67 కోట్లు చెల్లింపులు

ఆ మేరకు వాహనాలు లేవు.. డబ్బులూ తిరిగివ్వరు

నాలుగేళ్లుగా రూ.67.67 కోట్లు డీలర్ల వద్దే 

తిరిగి వసూలుకు అధికార యంత్రాంగం సన్నద్ధం 

సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో ఎస్సీ యువతకు ఉపాధి పేరుతో కేటాయించిన వాహనాలు, యంత్రాలను పక్కదారి పట్టించిన వ్యవహారంలో తవ్వేకొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిరుద్యోగ ఎస్సీలకు దక్కాల్సిన కార్లను టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలు కాజేసినట్లు ఇటీవల విజిలెన్స్‌ నిగ్గుతేల్చిన సంగతి తెలిసిందే. టీడీపీ పెద్దల సిఫారసు ఉన్నవారికే వాహనాలు ఇచ్చేలా ముందస్తు ఒప్పందాలు జరిగాయి.

ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ వారికి లబ్ధి చేకూర్చారు. ఇదిలా ఉండగా వాహనాలు సరఫరా చేసే డీలర్లతో టీడీపీ పెద్దలు కుదుర్చుకున్న డీల్‌ తాజాగా బహిర్గతమైంది. నిబంధనలకు విరుద్ధంగా ఇండెంట్‌ పెట్టిన వాహనాలన్నింటికీ డీలర్లకు ముందుగానే అడ్వాన్సులు చెల్లించారు. అయితే డీలర్లు ఆ మేరకు వాహనాలను సరఫరా చేయలేదు. ఏళ్ల తరబడి వాహనాలు ఇవ్వకుండా, ప్రభుత్వానికి నగదు తిరిగి చెల్లించకుండా డీలర్ల వద్దే డబ్బులు ఉండటాన్ని గమనిస్తే బినామీల బాగోతం, అక్రమ వ్యవహారాలు తేటతెల్లమవుతున్నాయి.

సబ్సిడీ రుణాలంటూ గొప్పలు..
ఎస్సీ యువతకు ఉపాధి కోసం వాహనాలు / యంత్రాలు సమకూర్చి సబ్సిడీ రుణాలు ఇచ్చినట్లు గత సర్కారు గొప్పలు చెప్పుకుంది. నేషనల్‌ షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ), నేషనల్‌ సఫాయి కర్మచారీ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ) ద్వారా వివిధ పథకాల కింద 2017–18 నుంచి 2018–19 వరకు సబ్సిడీపై వాహనాల కోసం రూ.వందల కోట్ల నిధులు కేటాయించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలకే లబ్ధి చేకూర్చేలా గత సర్కారు పెద్దలు డీలర్లతో గుట్టు చాటుగా వ్యవహారాన్ని నడిపించారు.

ఐదు పథకాలు.. పథకం ప్రకారం!
వాహనాలు అందకుండానే గత సర్కారు డీలర్లకు ముందే చెల్లింపులు జరపడం అక్రమాలను బలపరుస్తోంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ ద్వారా ఐదు పథకాల కింద లబ్ధిదారులకు ఇన్నోవాలు, ఇతియోస్, ట్రాక్టర్లు, ఈ ఆటోలు, మెకనైజ్డ్‌ డ్రెయిన్‌ క్లీనింగ్‌ మెషిన్లు(ఎండీసీఎం) ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకోసం టీడీపీ సర్కారు డీలర్లకు రూ.365,67,29,910 అడ్వాన్సులుగా చెల్లించింది.

ఆ మొత్తంలో రూ.298,00,01,285 విలువైన యూనిట్లను డీలర్లు సరఫరా చేశారు. మరో 5,467 యూనిట్లు (వాహనాలు, యంత్రాలు) ఇవ్వకపోవడంతో డీలర్ల వద్దే రూ.67,67,28,625 మేర డబ్బులు ఉండిపోవడం గమనార్హం. ఇందులో రూ.23.05 కోట్లకుపైగా ఇవ్వాల్సిన రాధా మాధవ్‌ ఆటోమొబైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (విజయవాడ) ఇటీవల బోర్డు తిప్పేసింది.

మరో మూడు కంపెనీల పేరుతో తప్పుడు చిరునామా ఇచ్చారు. వాహనాలు ఇవ్వకుండా ముఖం చాటేసిన సదరు డీలర్‌ ఏకంగా రూ.41.67 కోట్లకు పైగా ఎగ్గొట్టేందుకు దారులు వెతుకుతున్నాడు. మరో కంపెనీ పేరుతో అడ్వాన్సులు తీసుకున్న ఓ మహిళ నుంచి రూ.2.93 కోట్లు వసూలు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు ఎన్ని నోటీసులు పంపినా స్పందన లేదు.

డీలర్ల నుంచి రాబట్టేందుకు సన్నద్ధం
టీడీపీ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పొందిన డీలర్లు ఆ మేరకు వాహనాలు ఇవ్వకపోవడం, అడ్వాన్సులు తిరిగి వెనక్కు చెల్లించకపోవటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన దాదాపు రూ.67.67 కోట్లు నాలుగేళ్లుగా డీలర్ల వద్దే ఉండటంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొద్ది రోజుల క్రితం ఆయా డీలర్లతో సమావేశం నిర్వహించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒప్పందం ప్రకారం వాహనాలు ఇవ్వాలని లేదంటే డబ్బులైనా తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు.

అయితే అప్పటి ధరల ప్రకారం వాహనాలు ఇవ్వలేమని, పెరిగిన ధరల ప్రకారం తీసుకునేందుకు అంగీకరిస్తే పరిశీలిస్తామని రాధా మాధవ్‌ ఆటోమొబైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(విజయవాడ) ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు మూడు కంపెనీల పేరుతో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అడ్వాన్సులు తీసుకుని చేతులెత్తేయడంతో అతడితో తమకు సంబంధం లేదని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళ కూడా తప్పించుకుని తిరుగుతోంది. దీంతో మరోసారి ఆ డీలర్లను పిలిచి మాట్లాడాలని, అప్పటికీ దారికి రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  

మరిన్ని వార్తలు