టీడీపీ గూండాగిరీ.. మహిళకు విరిగిన చెయ్యి 

9 Apr, 2021 09:25 IST|Sakshi
శ్రీనుపై దాడికి  పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలు (ఇన్‌సెట్‌) విరిగిన చేతికి కట్టుతో రమణ

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడి

తీవ్రంగా గాయపడిన శ్రీను

దాడి చేసిన 10 మందిపై కేసు నమోదు

సాక్షి, పెదకూరపాడు(గుంటూరు): ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో టీడీపీ నేతలు గురువారం పోలింగ్‌ బూత్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ఈ దాడిలో వైఎస్సార్‌ సీపీ మహిళా కార్యకర్త నల్గొండ రమణకు చెయ్యి విరిగింది. మరో కార్యకర్త నల్గొండ శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కట్లగుంట సతీష్‌ పోలింగ్‌ మొదలైనప్పటి నుంచి వృద్ధులను ఓటు వేయించే నెపంతో తరచూ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి వస్తుండగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్త నల్గొండ శ్రీను అడ్డుకున్నారు. ఎంతమందిని ఇలా తీసుకెళ్తావని ప్రశ్నించాడు. దీంతో సతీష్‌ మరికొందరు టీడీపీ కార్యకర్తలు శ్రీనుపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు.

కిందపడిన శ్రీనును రక్షించే ప్రయత్నంలో గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ మహిళా కార్యకర్త నల్గొండ రమణ అడ్డుపడగా ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె చెయ్యి విరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి దాడికి పాల్పడుతున్న వారిపై లాఠీచార్జ్‌ చేసి, దాడి చేస్తున్న వారిని తరిమికొట్టారు. దీంతో కొంతసేపు పోలింగ్‌కు అంతరాయం ఏర్పాడింది. మరో మారు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ బూత్‌ వద్దకు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. విషయం తెలిసిన తుళ్లూరు డీఎస్పీ జె.శ్రీనివాసరావు, సీఐ తిరుమలరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం పోలింగ్‌ తిరిగి ప్రారంభమైంది. ఈ ఘటనపై బాధితురాలు రమణ ఫిర్యాదు మేరకు సతీష్‌తో పాటు దాడికి పాల్పడిన  తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుమలరావు తెలిపారు.


టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన  ప్రకాశరావు 

మరో ఘటనలో.. 
పెదనందిపాడు(ప్రత్తిపాడు): టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతకు గాయాలైన సంఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. గత పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ కమ్మ నాగమల్లేశ్వరరావు, టీడీపీ కార్యకర్తలు కమ్మ వీరయ్య, నెప్పలి సాంబయ్య ఓటర్లకు టీడీపీకి ఓటు వేయమని చెబుతుండగా, అదేంటి అలా చెబుతున్నావని ప్రశ్నించినందుకు  తనను బయటకు లాక్కువచ్చి కులం పేరుతో దూషించి కర్రలతో దాడి చేశారని వైఎస్సార్‌ సీపీ మండల ఎస్సీసెల్‌ కన్వీనర్‌ పి.ప్రకాశరావు తెలిపారు. తన  తలకు గాయమవటంతో అక్కడున్న వారు వెంటనే తనను బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు