బినామీల ముసుగులో 'భూబకాసురులు'

6 Jul, 2021 03:41 IST|Sakshi

వేలాది ఎకరాల అసైన్డ్, లంక భూములు కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు

రాజధానిని చుట్టేసిన వైనం

‘భూమిపుత్ర’తో అక్రమాల కుతంత్రం

ఆ ఒక్క సంస్థ కొల్లగొట్టిన భూములే 2,500 ఎకరాలు 

సాక్షి, అమరావతి: ఇవి.. అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలోని 2.05 ఎకరాల భూమి అమ్మకం రిజిస్ట్రేషన్‌ పత్రాలు. ‘ఆ భూమి అసైన్డ్‌ భూమి కాదు’  అని రాసి ఉంది. ఆ విధంగా పేర్కొంటూ ఆ భూమిని ఎంచక్కా విక్రయించి రిజిస్ట్రేషన్‌ కూడా చేసేశారు. కానీ ఆ భూమి అసైన్డ్‌ భూమి. నిబంధనల ప్రకారం ఆ భూమి క్రయవిక్రయాలు చెల్లవు. అది అసైన్డ్‌ భూమి కాదని చెప్పి 2015 సెప్టెంబరు 9న అమ్మేశారు. ఈ భూమి విక్రయానికి ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పూల రవి సాక్షి సంతకం చేశారు. రాజధాని ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడ్డ భారీ భూబాగోతానికి ఇది చిన్న ఉదాహరణ.. ఈ విధంగా ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది ఎకరాల అసైన్డ్, లంక భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల బినామీలు హస్తగతం చేసుకుని వేలకోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుత ప్రతిపక్ష నేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన
 

తనయుడు లోకేశ్‌ల సన్నిహితులు, బినామీల పేరిటే ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పలువురు, హైదరాబాద్‌లో, అమెరికాలో ఉంటున్న కొందరు చంద్రబాబు సన్నిహితులు బినామీలుగా మారారు. అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన రియల్‌ ఎస్టేట్‌ సంస్థల ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వేలాది ఎకరాలను చాపచుట్టేశారు. అందుకు ఒక ఉదాహరణగా.. భూమిపుత్ర రియల్‌ ఎస్టేట్‌ సంస్థ, దాని యజమాని బ్రహ్మానందరెడ్డి భూబాగోతం చూద్దాం..

భూమిపుత్ర.. దళితుల భూములపై కుట్ర
2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములపై కన్నేశారు. దళితుల వేళ్లతోనే దళితుల కళ్లు పొడిచే కుట్రకు పథకరచన చేశారు. అందులో భాగంగా భూమిపుత్ర రియల్‌ ఎస్టేట్‌సంస్థ ప్రముఖంగా తెరపైకి వచ్చింది. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ యజమాని కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ తరఫున రంగంలోకి దిగారు. దళితుల అసైన్డ్‌ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి, మళ్లీ చంద్రబాబు సన్నిహితులు, బినామీలపరం చేసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. తన సంస్థలో ఉద్యోగులుగా పలువురు దళితులను చేర్చుకుని వారి ద్వారానే భూములున్న దళితులతో సంప్రదింపులు జరిపించారు. రాజధాని వస్తుందన్న విషయాన్ని దాచిపెట్టి.. అప్పటికి ఆ ప్రాంతంలో ఎకరా రూ.20 లక్షలు వరకు ఉన్న భూములను కేవలం రూ.3 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఇక రాజధాని ప్రకటన తరువాత కూడా దళితుల భూములపై కుట్రను మరో కోణంలో కొనసాగించారు.

రాజధాని ప్రకటనతో అమరావతి ప్రాంతంలో ఎకరా రూ.కోటిపైగా ధర పలికింది. కానీ అసైన్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రచారం చేశారు. ఆ విధంగా భయపెట్టి ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకే కొనుగోలు చేశారు. విజయవాడలోని పటమటలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసి మొత్తం వ్యవహారం అక్కడ నుంచి నడిపించారు. ఒక్క భూమిపుత్ర రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ద్వారానే 2,500 ఎకరాల అసైన్డ్, లంక భూముల్ని టీడీపీ పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి తమ చేతుల్లో పెట్టుకున్నారు. ఐనవోలు, బేతపూడి, శాఖమూరు, తుళ్లూరు, ఎర్రబాలెం, నేలటూరు, దొండపాడు, అనంతవరం, నెక్కల్లు తదితర గ్రామాల్లో అసైన్డ్‌ భూములను చుట్టేశారు. దళితులకు వ్యక్తిగతంగా ఇచ్చిన అసైన్డ్‌ భూములు మాత్రమే కాదు.. దళితులకు ఉమ్మడిగా సొసైటీల కింద ఇచ్చిన అసైన్డ్‌ భూములను కూడా వదల్లేదు. రాయపూడిలోని అంబేడ్కర్‌ సొసైటీకి చెందిన 160 ఎకరాలు, లెనిన్‌ సొసైటీకి చెందిన 100 ఎకరాలు, బాపూజీ నగర్‌లోని దళితులకు ఇచ్చిన జగ్గప్ప చెరువు భూములు.. ఇలా అసైన్డ్, లంక భూములను తమపరం చేసుకున్నారు. 

2 రోజులు.. 51 రిజిస్ట్రేషన్లు.. ఒకే సాక్షి
భూమిపుత్ర రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఎంత అడ్డగోలుగా అసైన్డ్‌ భూములను కొల్లగొట్టిందో తెలుసుకోవడానికి పూల రవి సంతకాలే సాక్ష్యం. భూమిపుత్ర రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో ఉద్యోగి అయిన పూల రవి.. ఆ సంస్థ యజమాని బ్రహ్మానందరెడ్డికి ప్రధాన అనుచరుడు. 2015 సెప్టెంబర్‌ 21, 22 తేదీల్లో 60.27 ఎకరాల అసైన్డ్, లంక భూములకు సంబంధించి ఏకంగా 51 విక్రయ రిజిస్ట్రేషన్లకు అతడు సాక్షి సంతకం చేశారు. అసైన్డ్‌ భూములను కూడా జిరాయితీ భూములుగా పేర్కొంటూ మరీ రిజిస్ట్రేషన్లు చేసేశారు. దీనిపై తాజాగా సీఐడీ అధికారులు పూల రవికి నోటీసులు జారీచేశారు. ఆ 51 రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు తెలపాలని పేర్కొంటూ 8 ప్రశ్నలతో నోటీసులు ఇచ్చారు. 

భూములు కొన్న నిరుపేద దళితుడు!
పేద దళితుడైన యెల్లమటి ప్రసాద్‌ అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసి.. మళ్లీ పలువురికి విక్రయించినట్టు రికార్డుల్లో ఉంది. దీనిపై సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో ఆయన అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ వ్యవహారం గురించి ఆయనకు ఏమాత్రం తెలియదు. భూమిపుత్ర రియల్‌ ఎస్టేట్‌సంస్థలో ఉద్యోగిగా చేసిన ఆయన 2015 సెప్టెంబరులో జరిగిన 24.56 ఎకరాల అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లకు ఆయనే సాక్షి. ఈ క్రమంలో ఆయన కూడా కొన్ని భూములు కొన్నట్లు, వాటిని అప్పటి టీడీపీ పెద్దల సన్నిహితులకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ విషయం తెలిసిన తరువాత ఆయన అప్పట్లో జరిగిన అసైన్డ్‌ భూముల అక్రమాలపై గత ఏడాది సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

అక్రమాలకు రాజముద్ర
వేలాది ఎకరాల అసైన్డ్, లంక భూములను కొల్లగొట్టిన తెలుగుదేశం పెద్దలు.. అనంతరం ఆ అక్రమాలకు ప్రభుత్వంతో రాజముద్ర వేయించారు. అసైన్డ్, లంక భూములకు కూడా భూసమీకరణ కింద నివాస, వాణిజ్య ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2016 ఫిబ్రవరిలో జీవో 41 జారీచేసింది. ఈ అక్రమాలకు ఆమోదముద్ర వేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది.

మాకు తెలియకుండానే మా పేరుతో కొన్నారు, అమ్మారు
టీడీపీ ప్రభుత్వంలో అసైన్డ్‌ భూముల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. మా ఆధార్‌ కార్డులు తీసుకుని మాకు తెలియకుండానే మా పేరున భూముల కొనుగోళ్లు, అమ్మకాలు చేశారు. విజయవాడ, గుంటూరుతోపాటు హైదరాబాద్, అమెరికా నుంచి కూడా పలువురు వచ్చి అసైన్డ్‌ భూములు కొనుగోలు చేశారు. వారికి ఇక్కడ భూముల విషయమే తెలియదు. వారంతా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పెద్దలకు బినామీలే. 
– యెల్లమటి ప్రసాద్‌

మరిన్ని వార్తలు