కదిరి టౌన్‌ సీఐ మధును చంపాలి

26 Aug, 2022 03:54 IST|Sakshi

టీడీపీ కార్యకర్తల ఫోన్‌ సంభాషణ 

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌  

కదిరి: ‘మన నాయకుడు కందికుంట వెంకటప్రసాద్‌పై చర్యలు తీసుకుంటున్న కదిరి టౌన్‌ సీఐ మధును బహిరంగంగా నరికి చంపాలనేది నా కోరిక.  మన నాయకుడి జోలికొస్తే పోలీసు అధికారులనే కాదు.. ఆఖరుకు సీఎంనైనా వదలకూడదు..’ అని శ్రీ సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త మరో కార్యకర్తతో ఫోన్‌లో జరిపిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. దీనిపై పోలీసులు ప్రాథమికంగా ఆరా తీయగా కదిరి టీడీపీ కార్యకర్త మౌళాలినాయుడు, మరో టీడీపీ కార్యకర్త సిద్ధూగౌతమ్‌తో  ఫోన్‌లో సంభాషించినట్లు తేలింది.  

ఏం జరిగిందంటే.. 
కదిరిలోని ఓ వెంచర్‌లో స్థలం కొనుగోలు చేసిన కొందరు ఈ నెల 24న ఇళ్ల నిర్మాణానికి పునాదులు తవ్వేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే 4 రోజుల కిందట వాళ్లను తన ఇంటికి పిలిపించిన కందికుంట దుప్పటి పంచాయతీకి దిగారు. తన అనుచరుడు సోమశేఖర్‌ పూర్వీకులు గతంలో ఆ భూమిని తక్కువ రేటుకు విక్రయించారని, అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా సెంటుకు రూ.2 లక్షల చొప్పున సోమశేఖర్‌కు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే అక్కడ ఎవ్వరూ ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదని హెచ్చరించారు.

ఇందుకు వారు ఒప్పుకోకపోవడంతో బుధవారం అనుచరులతో కలిసి వెంచర్‌ వద్దకు వెళ్లిన కందికుంట పనులను అడ్డుకున్నారు. జేసీబీపై రాళ్లవర్షం కురిపించి ధ్వంసం చేశారు. ఈ దాడిలో జేసీబీ డ్రైవర్‌  గాయపడ్డారు. జేసీబీని తగలబెట్టేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పట్టణ సీఐ తమ్మిశెట్టి మధు అడ్డుకుని గుంపును చెదరగొట్టారు. దీన్ని జీర్ణించుకోలేని  సీఐని అసభ్య పదజాలంతో దూషించారు.  ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ వారు ఏకంగా సీఐనే చంపేయాలని మాట్లాడుకున్న ఆడియో వైరల్‌ అయింది.  

మరిన్ని వార్తలు