తోడేస్తున్న తెలంగాణ

29 Jun, 2021 02:57 IST|Sakshi

శ్రీశైలంపై కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతర్‌

పూర్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తికి ఉత్తర్వులు

కనీస డ్రాయింగ్‌ లెవల్‌ 834 అడుగులు.. 796 అడుగుల నుంచే కరెంట్‌ ఉత్పత్తి

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటికి కటకట 

నీటిమట్టం 881 అడుగులకు చేరేదెప్పుడు? రాయలసీమ గొంతు తడిసేదెప్పుడు?

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సీమ ఎత్తిపోతల పథకం చేపట్టిన ఏపీ

సాక్షి, అమరావతి: కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో యథేచ్ఛగా జల దోపిడీకి పాల్పడుతోంది. జలాశయంలో కనీస డ్రాయింగ్‌ లెవల్‌కు నీటి మట్టం చేరుకోకపోయినప్పటికీ పూర్తి సామర్థ్యంతో జల విద్యుదుత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. జల విద్యుత్‌ ప్రాజెక్టుల గరిష్ట సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేపట్టాలని టీఎస్‌ జెన్‌కోను ఆదేశిస్తూ తెలంగాణ ఇంధన శాఖ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా జీవో నం 34 జారీ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. శ్రీశైలంలో నీటిని జల విద్యుదుత్పత్తికి వాడేస్తుండటంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీటి సరఫరా ఎండమావిగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కనీస డ్రాయింగ్‌ లెవల్‌ అయిన 834 అడుగులకు నీటి మట్టం చేరకుండానే  తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టున 796 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వాడేయడంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. శ్రీశైలంలో జల విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ఆపాలని బోర్డు ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం లక్ష్యపెట్టకుండా పూర్తి స్థాయి సామర్ధ్యంతో జల విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ఏకంగా ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. 

854 అడుగులు ఎప్పటికి?
ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 821.30 అడుగులు మాత్రమే ఉంది. ఇప్పటి నుంచే జల విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వాడేయడం వల్ల పోతిరెడ్డిపాడు, చైన్నైకు తాగునీరు, ఎస్‌ఆర్‌బీసీ, కెసీ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్‌కు నీటి విడుదలకు అవసరమైన 854 అడుగులకు నీటి మట్టం ఎప్పటికి చేరుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 854 అడుగులకు చేరితేనే పోతిరెడ్డిపాడు నుంచి 7,000 క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకు వీలుంటుంది. విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వాడుతూ జలాశయాన్ని ఖాళీ చేయడం వల్ల ఎగువన వరద వచ్చినా 854 అడుగులకు చేరడం సాధ్యం కాదు. పోతిరెడ్డిపాడు నుంచి చుక్క నీరు తీసుకోవడానికి అవకాశం ఉండదు. భారీ వరదలు వచ్చి నీటిమట్టం పెరిగినా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగితే వారం రోజులకు మించి ఉండే అవకాశం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి మట్టం తగ్గిపోయినప్పుడు కూడా తెలంగాణ రోజూ దాదాపు 7 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అవకాశం ఉంది. 

808.40 అడుగుల నుంచే విద్యుదుత్పత్తి
కనీస డ్రాయింగ్‌ లెవల్‌ 834 అడుగులు కాగా అంత కన్నా తక్కువగా 808.40 అడుగులు నుంచే తెలంగాణ జెన్‌కో ఈ నెల 1వ తేదీ నుంచే విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నెల 23న కృష్ణా బోర్డు దృష్టికి తెచ్చింది. దీన్ని వెంటనే ఆపాలని కోరింది. ఈ నెల 22వతేదీ నాటికే మూడు టీఎంసీలను తెలంగాణ జెన్‌కో వినియోగించినట్లు తెలిపింది. 

కేటాయింపులే.. నీళ్లు లేవు
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్‌బీసీ, గాలేరు–నగరి, చెన్నై తాగు నీటి పథకాలకు నీళ్లు అందించాలి. కేసీ కెనాల్‌ సప్లిమెంటేషన్‌కు నీళ్లు ఇవ్వాలి. కృష్ణా ట్రిబ్యునల్, విభజన చట్టం ద్వారా ఈ ప్రాజెక్టులకు 114 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. శ్రీశైలంలో 881 అడుగుల ఎత్తులో నీటి నిల్వ ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి గరిష్టంగా 44 వేల క్యూసెక్కుల ప్రవాహం కాలువలకు మళ్లుతుంది. ఆ స్థాయిలో నీటి మట్టం ఏటా సగటున పక్షం రోజులు కూడా ఉండటం లేదు. మరోవైపు 800 అడుగుల స్థాయిలో నీటి నిల్వ ఉన్నా పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా తెలంగాణ రోజూ దాదాపు 3 టీఎంసీల నీటిని తరలించుకునే వీలుంది. 796 అడుగులకు దిగువన నీటిమట్టం ఉన్నా ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా తెలంగాణ రోజూ 4 టీఎంసీల నీటిని వాడుకుంటోంది. ఫలితంగా శ్రీశైలంలో నీటిమట్టం వేగంగా తగ్గిపోతోంది. కేటాయింపులు ఉన్నా సరే శ్రీశైలం నుంచి నీటిని తీసుకోలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు ఎదురవుతోంది. దీని నుంచి బయటపడటానికి, కరువు ప్రాంతమైన రాయలసీమకు తాగునీరు అందించడానికి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులర్‌ దిగువన కాలువలోకి నీటిని ఎత్తిపోయడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపట్టాల్సి వచ్చింది. తెలుగుగంగ నుంచి చైన్నై తాగునీటి సరఫరా కూడా ఇదే ఆధారం. 

మరిన్ని వార్తలు