రాష్ట్రంలో మరో 54 రైతు బజార్లు

3 Sep, 2023 05:06 IST|Sakshi

రూ.41.09 కోట్లతో నిర్మాణం.. రూ.4.50 కోట్లతో నాడు–నేడు కింద మరికొన్ని ఆధునికీకరణ

ఇప్పటికే 15 బజార్లు ప్రారంభం

మరో 3 బజార్లు ఈ నెల 15న ప్రారంభించేందుకు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో కొత్తగా మరిన్ని రైతు బజార్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రూ.41.09 కోట్ల వ్యయంతో ఒకేసారి 54 కొత్త రైతు బజార్లను నెలకొల్పుతోంది. వీటిలో ఇప్పటికే 15 రైతు బజార్లు అందుబాటులోకి రాగా.. మరో 3 రైతు బజార్లు ఈ నెల 15న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.  

గత ప్రభుత్వ నిర్లక్ష్యం 
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులతో పాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రైతుబజార్లను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన సమయానికి ఏపీలో 87 రైతు బజార్లు ఉండేవి. కొత్త రైతు బజార్ల ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ స్థలాల కొరత, నిధుల లేమి సాకుతో గత టీడీపీ ప్రభుత్వం వాటి జోలికి పోలేదు. ఉన్న రైతు బజార్లలోనూ కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా రైతులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రైతుబజార్ల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది. కాకినాడ జిల్లాలో 10, తూర్పు గోదావరి జిల్లాలో 4, విజయనగరం, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 3 చొప్పున, విశాఖపట్నం, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో 2 చొప్పున, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, బాపట్ల, తిరుపతి, నంద్యాల, కర్నూలు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మిస్తారు. వీటిలో 11 టెండర్ల దశలో ఉండగా, 7 బేస్‌మెంట్‌ దÔèæ, 8 రూఫ్‌స్థాయి, 5 సీలింగ్‌ స్థాయిల్లో ఉండగా, మరో ఐదుచోట్ల టెండర్లు పిలవాల్సి ఉంది.

నాడు–నేడు కింద మౌలిక వసతుల కల్పన 
నాడు–నేడు కింద రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, వైఎస్సార్‌ జిల్లాల్లోని మొత్తం రైతుబజార్లను ఆధునికీకరిస్తున్నారు. శిథిలమైన షెడ్ల పునర్నిర్మాణంతో పాటు ఆర్వో ప్లాంట్స్, విద్యుత్, మరుగు­దొడ్లు నిర్మిస్తున్నారు. పార్కింగ్, హోర్డింగ్స్, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో స్వయం సంవృద్ధి సాధించే దిశగా రైతుబజార్లను తీర్చిదిద్దుతున్నారు.

ఒకేసారి 54 రైతు బజార్ల నిర్మాణం
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 54 కొత్త రైతుబజార్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వీటిలో 15 రైతుబజార్ల సేవలు అందుబాటులోకి రాగా.. మరో 3 రైతుబజార్లను ఈ నెల 15న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశాం. మిగిలిన వాటిని దశల వారీగా ప్రారంభిస్తాం. 
– ముల్లంగి నందకిషోర్, సీఈవో, రైతుబజార్లు

మరిన్ని వార్తలు