పరిశ్రమలకు సకాలంలో రాయితీ, భూ కేటాయింపు 

21 Oct, 2023 02:53 IST|Sakshi

ఎస్‌ఐపీసీ సమావేశంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ (ఎస్‌ఐపీసీ) సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు, సంస్థలకు సంబంధించి ప్రభుత్వం అందించే రాయితీలు, భూమి కేటాయింపు తదితర అంశాలు చర్చించగా, వాటికి కమిటీ ఆమోదం తెలిపింది.

సీఎస్‌ మాట్లాడుతూ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో అవగాహన ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు, సంస్థలు, ఆ తరువాత వచ్చిన కంపెనీలకు సంబంధించి ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన రాయితీలు, భూ కేటాయింపు అంశాల్లోను, వాటిని సకాలంలో ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ  కార్యదర్శి డా.ఎన్‌.యువరాజ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అజెండా, అందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

అజెండా వారీగా ఆయా  సంస్థలు, కంపెనీల ఏర్పాటుకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.  ఇంధన, ఆర్థిక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.విజయానంద్, ఎస్‌.ఎస్‌.రావత్, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, రాష్ట్ర పర్యాటక శాఖ సంస్థ ఎండీ కె.కన్నబాబు, నెడ్‌ క్యాప్‌ ఎండీ రమణారెడ్డి, పుడ్‌ ప్రోసెసింగ్‌ సొసైటీ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌ రెడ్డి, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌ కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు