మూడు రాజధానులకే మా మద్దతు 

2 Nov, 2022 04:24 IST|Sakshi
తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవ ఆమోదం 

రాజధాని వికేంద్రీకరణకు సంపూర్ణ మద్దతు 

తిరుపతి తుడా: మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయానికి తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిల్‌ మద్దతు తెలిపింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మునిసిపల్‌ కార్యాలయంలో మేయర్‌ శిరీష అధ్యక్షతన మంగళవారం అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూడు రాజధానుల ఆవశ్యకతను వివరించారు.

తీర్మానాన్ని నగర మేయర్‌ డాక్టర్‌ ఆర్‌.శిరీష బలపరచగా.. డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, భూమన అభినయ్‌రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు. సభ్యుల్లో ఒక్కరు కూడా రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించకపోవడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని మేయర్‌ శిరీష ప్రకటించారు. కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ఆమె చెప్పారు.

ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతున్నాయన్నారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలును రాజధాని చేస్తామని చెప్పి నమ్మించారన్నారు. ఆపై తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేస్తూ ఉమ్మడి ఏపీ ఏర్పడినప్పుడు కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తన్నుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉమ్మడి ఏపీ విడిపోతే కర్నూలుకు రావాల్సిన రాజధానిని కుట్రపూరితంగా, దురుద్దేశంతో అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు. రాయలసీమకు రావాల్సిన నీటి ప్రాజెక్టులను సైతం అడ్డుకున్న నీచుడు చంద్రబాబని దుయ్యబట్టారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను తుంగలో తొక్కి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని ధ్వజమెత్తారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంటే.. అందుకు విరుద్ధంగా చంద్రబాబు 29 గ్రామాలకే న్యాయం జరగాలని పట్టుబట్టడం సిగ్గుచేటన్నారు. రాజధాని, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. అన్ని ప్రాంతాలకు సమానంగా విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మూడు రాజధానులతోనే సాధ్యమవుతాయని చెప్పారు.

భవిష్యత్తులో వేర్పాటువాదం రాకూడదన్న ముందు చూపుతోనే సీఎం జగన్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అయితే చంద్రబాబు అండ్‌ కో వికేంద్రీకరణను అడ్డుకుంటున్నారని విమర్శించారు. వికేంద్రీకరణకు సీమవాసులంతా మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఇటీవల రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన విజయవంతం చేసిన భూమన కరుణాకరరెడ్డికి మునిసిపల్‌ కౌన్సిల్‌ అభినందనలు తెలిపింది.    

మరిన్ని వార్తలు