కట్టు కథలు, పిట్ట కథలు మానుకో శ్రీరామ్‌ 

20 Sep, 2022 10:40 IST|Sakshi

రాప్తాడురూరల్‌: పరిటాల శ్రీరామ్‌ చెబుతున్నట్లు వారి తాతల కాలం నుంచి వారి కుటుంబం నిజంగా బడుగు, బలహీన వర్గాల బాగు కోసం పనిచేసి ఉంటే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన వర్గాలే 2019 ఎన్నికల్లో ఏకంగా 25 వేలకు పైగా ఓట్ల తేడాతో ఎందుకు ఓడించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ  సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) సూచించారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై పరిటాల శ్రీరామ్‌ కట్టు కథలు, పిట్ట కథలు మానుకోవాలని హితవు పలికారు. ‘మా నాన్న తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి ఎవరికీ బెదిరే, అదిరేవారు కాదు. దౌర్జన్యాలకు తలవంచే మనస్తత్వం అసలే కాదు. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడే దౌర్జన్యాలను ఎదిరించిన ధీరుడు. నీ దౌర్జన్యాలకు ఇక్కడ భయపడే వారెవరూ లేరని రవి మొహం మీదే చెప్పిన వ్యక్తి మా నాన్న.

ఈ విషయాన్ని అప్పటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు సాలార్‌ బాషా,  మీ చిన్నాన్న గడ్డం సుబ్రహ్మణ్యంను అడిగితే తోపుదుర్తి పౌరుషం ఏంటో తెలుస్తుంది. మీ తాతల గురించి, మీ నాన్న గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మీరు మంచి చేసిందేమీ లేదు. ఉద్యమం పేరుతో దోపిడీ సాగించారు.  ఐదెకరాల నుంచి ఈరోజు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తారు. మా ఆస్తులు పేదలకు పంచేందుకు సిద్ధం. మీ ఆస్తులు పంచేందుకు మీరూ సిద్ధమేనా?’ అని సవాల్‌ విసిరారు. 

మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది! 
‘పరిటాల శ్రీరాములు, బోయ సిద్దయ్య ఇద్దరూ కలసి దోపిడీలు చేస్తే..బోయ సిద్దయ్యనేమో దొంగగా మార్చి, శ్రీరాములు ఉద్యమకారుడు అంటూ పచ్చమీడియా చిత్రీకరించింది. ఇద్దరూ దొంగలైనా కావాలి.. లేదంటూ ఇద్దరూ ఉద్యమకారులైనా కావాలి. పరిటాల శ్రీరాములు ఒక్కడే ఉద్యమకారుడు ఎలా అవుతాడు? పరిటాల రవి హత్యలు చేసి ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెంపినాడు.

గత ప్రభుత్వంలో శ్రీకాకుళం అడవుల్లో 26 మంది నక్సల్స్‌ను ఎన్‌కౌంటర్‌ చేస్తే మంత్రిగా ఉన్న మీ తల్లి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. మీరా సిద్ధాంతాల గురించి మాట్లాడేది? నసనకోట పంచాయతీలోనే భూములు లాక్కున్న చరిత్ర మీ నాన్నది. నువ్వు బచ్చావు.. నీకు తెలీకపోతే ఓసారి పెద్దోళ్లను అడిగితే చెబుతార’ని పరిటాల శ్రీరామ్‌కు హితవు చెప్పారు.  

అనంతపురం చుట్టుపక్కల రియల్‌ ఎస్టేట్‌ మాఫియా నడుపుతూ లిటిగెంట్‌ భూములను కొనుగోలు చేస్తూ  దందాలు చేస్తోంది మీరుకాదా అని నిలదీశారు. బెంగళూరు కేంద్రంగా అడ్రెస్‌ లేని సిమ్‌ల ద్వారా తమ కుటుంబం గురించి అసభ్యకరంగా మాట్లాడిస్తూ పైశాచిక ఆనందం పొందుతుండడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఐటీడీపీ పేరుతో పరిటాల కుటుంబం ఉన్మాద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.   

(చదవండి: అనంతలో ప్రభుత్వ ఉద్యోగుల కృతజ్ఞత ర్యాలీ)

మరిన్ని వార్తలు