దుర్గమ్మ దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి

5 Apr, 2021 03:39 IST|Sakshi

దుర్గమ్మ దర్శనానికి నేటి నుంచి అమలు

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తులు విధిగా సంప్రదాయ వ్రస్తాలు ధరించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు. నేటి (సోమవారం) నుంచే ఈ సంప్రదాయం అమలయ్యేలా చూడాలంటూ దుర్గ గుడి ఈవో ఎంవీ సురేష్ బాబు ఆలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అంతరాలయ దర్శనం చేసుకునే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ వ్రస్తాలను ధరించేలా చూడాలన్నారు. ప్రస్తుతం కోవిడ్‌ నేపథ్యంలో అంతరాలయ దర్శనం నిలిపివేసినప్పటికీ, తిరిగి అంతరాలయ దర్శనం ప్రారంభించినప్పుడు ఈ నిబంధనను పటిష్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. పురుషులకు దోవతి, పైజామా లాల్చీలు, మహిళలకు చీర, చున్నీలతో కూడిన పంజాబీ డ్రస్సును మాత్రమే అనుమతిస్తారు.

ఇప్పటికే దుర్గామల్లేశ్వరస్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వ్రస్తాలు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై అమ్మవారి దర్శనానికి విచ్చేసే వారు సైతం సంప్రదాయ వ్రస్తాలను ధరించాల్సి ఉంటుంది. ఒక వేళ దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తుల వద్ద సంప్రదాయ వ్రస్తాలు లేని పక్షంలో వారి కోనం దేవస్థానం ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేసి చీరలు, పంచెలను అందుబాటులో ఉంచుతుంది. అమ్మవారికి సమర్పించే సారె విక్రయ కేంద్రాలలోనే ఈ వ్రస్తాలు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు