జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ బదిలీ

30 Jan, 2021 05:45 IST|Sakshi

నిమ్మగడ్డ నిర్ణయం..

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తనకున్న విచక్షణాధికారాలతో సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ రాశారు.  ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈ నెల 23న ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకాకపోవడానికి ప్రవీణ్‌ ప్రకాశే కారణమని తాను చేయించిన విచారణల్లో తేలిందన్నారు. 

నేను నిబంధనల మేరకే పనిచేశా: పవీణ్‌ ప్రకాశ్‌ వివరణ  
పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో తాను నిబంధనల ప్రకారమే పనిచేశానని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తన గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖపై వివరణ ఇస్తూ ఆయన సీఎస్‌కు శుక్రవారం లేఖ రాశారు. నిమ్మగడ్డ లేఖలో పూర్తి అంశాలను వివరించలేదన్నారు. ఎస్‌ఈసీ నుంచి తనకు మెయిల్‌ ద్వారా వచ్చిన లేఖపై తాను వెంటనే స్పందించానని, జీఏడీ ముఖ్య కార్యదర్శి(పొలిటికల్‌) కార్యాలయం స్వతంత్రమైంది కాదని, జీఏడీకి సీఎస్‌ అధిపతి అని, తాను ఆయనకే రిపోర్టు చేస్తాననే విషయాన్ని రమేష్‌ తెలుసుకోవాలన్నారు.

జీఏడీలోని ఐదుగురు ముఖ్య కార్యదర్శుల్లో జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి సీఎస్‌కు సపోర్టింగ్‌ అధికారి మాత్రమేనన్నారు. కాబట్టి తాను స్పందించలేదని ఎస్‌ఈసీ అనడం ఎంతవరకు న్యాయమని, ఇది నైతికమా? అని ప్రశ్నించారు. ‘‘పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంపై న్యాయవివాదం కొనసాగుతున్నందున, యథాతథస్థితి కొనసాగించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తెలిపిన విషయం కలెక్టర్లు, ఎస్పీలందరికీ తెలుసు. వారు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాకపోవడానికి అదే కారణం. ఈ అంశంలో నేను ప్రత్యేకంగా అధికారులను ఆదేశించింది ఏమీ లేదు. దీంతో నాకెలాంటి సంబంధం లేదు. వాస్తవాలిలా ఉంటే వీడియో కాన్ఫరెన్స్‌ జరక్కుండా నేను అడ్డుకున్నానని ఎస్‌ఈసీ అనడం ఏమాత్రం సమంజసం కాదు’’ అని ప్రవీణ్‌ ప్రకాశ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు