శ్రీనివాసుని అభిషేకానికి మన్యం మకరందం

17 Dec, 2021 04:16 IST|Sakshi
తిరుమలలోని గోదాంలో జీసీసీ తేనెను భద్రపరుస్తున్న సిబ్బంది

సాక్షి, విశాఖపట్నం: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి మన్యం తేనె సిద్ధమైంది. శ్రీనివాసుని అభిషేకానికి గిరిజన తేనె కొనుగోలు చేయాలంటూ ఇటీవల టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్‌పర్సన్‌ శోభా స్వాతి రాణి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన టీటీడీ బోర్డు తిరుమల ప్రధాన ఆలయంలో స్వామివారి అభిషేకంతో పాటు ఇతర దేవాలయాల్లో అభిషేకానికి గిరిజన తేనె పంపించాలంటూ ఆర్డరు పెట్టారు. 1,800 కిలోల తేనె సిద్ధం చేయాలన్న టీటీడీ ఆదేశాలతో జీసీసీ ఏర్పాట్లు చేసింది.

తొలుత రూ.2.69 లక్షల విలువైన 900 కిలోల మన్యం తేనెతో జీసీసీ వాహనం గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకుంది. మరో 15 రోజుల్లో మిగిలిన తేనెను పంపేందుకు ప్రాసెసింగ్‌ చేపడుతున్నట్లు జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతి రాణి తెలిపారు. గిరిజనులు ప్రకృతి వ్యవసాయంతో ఆర్గానిక్‌ పద్ధతిలో తయారు చేసిన తేనెను కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సేవకు సమకూర్చే అవకాశం కల్పించినందుకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు