భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా..గిరిజన మ్యూజియం

23 Apr, 2023 05:42 IST|Sakshi

రూ.35 కోట్లతో నిర్మాణం   

గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా కళాఖండాల ఏర్పాటు 

60 శాతం నిర్మాణ పనులు పూర్తి   

డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చేలా కార్యాచరణ

సాక్షి, అమరావతి: గిరిజన స్వాతంత్య్ర వీరుల చరిత్రను భావితరాలకు అందించి వారిలో స్ఫూర్తి నింపే మహోన్నత లక్ష్యంతో చేపట్టిన మ్యూజియం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రా కశ్మిర్‌గా పేరుగాంచిన లంబసింగికి సమీపంలో రూ.35 కోట్లతో ట్రైబల్‌ ఫ్రీడం ఫైటర్స్‌ మ్యూజియం పనులు ఇప్పటికే 62.25 శాతానికి పైగా పూర్తయ్యాయి. గిరిజన పోరాటం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యాధునిక సదుపాయాలతో ఈ మ్యూజియం నిర్మాణం జరుగుతోంది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చేలా కార్యాచరణ చేపట్టారు.

ఇప్పటికే అరకు, కర్నులు జిల్లా శ్రీశైలం, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో మ్యూజియంలున్నాయి. అల్లూరి సీతారామరాజుతో పాటు స్వాతంత్య్ర సంగ్రామంలో గర్జించిన గిరిజన యోధులు మల్లు దొర, గంటం దొర విగ్రహాలను నెలకొల్పనున్నారు. గిరిజన యోధుల చరిత్రను భావితరాలకు అందించేలా శిల్పాలు, ఫొటోలను ఏర్పాటు చేస్తారు. బ్రిటీష్‌ పాలకులను గడగడలాడించిన గిరిజన పోరాట ఘట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులోకి తెస్తారు.

గిరిజనుల జీవన విధానం, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను కళాఖండాలుగా ఏర్పాటు చేస్తారు. మ్యూజియం గోడలు, పైకప్పుపై గిరిజన కళాకృతులను ఏర్పాటు చేస్తారు. నాటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను సందర్శకుల కళ్లకు కట్టినట్టు వివరించడానికి 300 మంది కూర్చుని వీక్షించేలా డిజిటల్‌ థియేటర్‌ను నిరి్మస్తున్నారు. ట్రైబల్‌ థీమ్‌ హట్‌తో కూడిన రెస్టారెంట్, ఓపెన్‌ థియేటర్, స్వాగత ప్లాజాలను నిర్మిస్తున్నారు.  

పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం  
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన గిరిజన మ్యూజియం నిర్మాణాన్ని గత టీడీపీ ప్ర­భుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వం వచ్చాక దీని నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధపెట్టింది. 2021లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగిలో 21.67ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించ­డం­తో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

వేగంగా నిర్మాణ పనులు
నాలుగు విభాగాలుగా చేపట్టిన మ్యూజియం నిర్మాణాన్ని ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది. కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధుల మ్యూజియంను మంజూరు చేసి రూ.15 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.20 కోట్లతో పాటు 21.67 ఎకరాల భూమిని కేటాయించడంతో మ్యూజియం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.    – రవీంద్రబాబు, మిషన్‌ డైరెక్టర్, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్‌

మరిన్ని వార్తలు