AP: ముగిసిన జీ20 సదస్సు

1 Apr, 2023 02:55 IST|Sakshi

విశాఖలో 4 రోజులు కొనసాగిన సమావేశాలు

హాజరైన దేశ విదేశీ ప్రతినిధులు

చివరిరోజు సదస్సుకు దేశవ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్ల రాక

సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా మార్చి 28 నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించిన జీ 20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూపు (ఐడబ్ల్యూజీ) సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఇండియా ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో ‘రేపటి ఆర్థిక నగరాలు – అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అవ­కాశాలు’పై ప్రధానంగా సదస్సు జరిగింది. 14 సభ్య దేశాలు, ఎనిమిది అతిథి దేశాలు, పది అంతర్జా­తీయ సంస్థలకు చెందిన 57 మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.

యూఎన్‌డీపీ, ఓఈసీడీ, ఐఎంఎఫ్, వరల్డ్‌ బ్యాంకు, ఏడీబీ, ఈబీఆర్‌డీ లాంటి అంతర్జాతీయ సంస్థల నిపుణులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య­రాజ్‌ సదస్సుకు అధ్యక్షత వహించారు. నగరాలను ఆర్థిక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రైవేట్‌  రంగంలో పెట్టుబడులను పెంచడంపై సదస్సులో చర్చించారు.

రెండో రోజు సాగర తీరంలో యోగా, ధ్యానంతో పాటు పౌష్టికాహార వినియోగంపై నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్వాలిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (క్యూఐఐ) సూచికల అన్వేషణ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యయంపై డేటాను క్రోడీకరించడంపై సమగ్రంగా చర్చిం­చారు. మూడో రోజు కెపాసిటీ బిల్డింగ్‌పై వర్క్‌షాపు నిర్వహించారు.

కొరియా, సింగపూర్‌­లకు చెందిన నిపుణులు అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్సింగ్‌లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన జీవన విధానంపై చర్చించారు. నాలుగో రోజు శుక్రవారం దేశంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు.

ఆఖరి రోజు ‘జన్‌ భగీదారి’..
జీ 20 సదస్సు చివరి రోజు జన్‌ భగీదారీ కార్యక్రమం ఏర్పాటు చేయడం రివాజు. ఇందులో భాగంగా ఆతిథ్య దేశంలోని స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాల వీసీలు, విద్యార్థులతో వర్క్‌షాపు నిర్వహిస్తారు. శుక్రవారం వర్క్‌షాపులో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ, హర్యానా, మణిపూర్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్, తమిళనాడుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రా  నగర్‌ హవేలి, డామన్‌ డయ్యూలకు చెందిన మున్సిపల్‌ కమిషనర్లు, పట్టణాభివృద్ధి శాఖల డైరెక్టర్లు 80 మంది పాల్గొన్నారు. వీరితో పాటు వీసీలు, ఫ్రొఫెసర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు కూడా హాజరయ్యారు. 

సుస్థిరాభివృద్ధి దిశగా..
తొలిరోజు సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీ 20 దేశాల ప్రతినిధులతో సమావేశమై పలు సూచనలు చేశారు. మౌలిక సదుపాయాల రంగంపై చర్చించడం మంచి పరిణామమని చెప్పారు. సుస్థిరాభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, లక్షలాది గృహాలను నిర్మిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. 

ఆత్మీయ ఆతిథ్యం..
విశాఖలో తొలిసారిగా జరిగిన జీ 20 సదస్సును రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. దేశ విదేశాల నుంచి అతిథులు హాజరైన నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. 2,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు కల్పించింది. ఆంధ్రా, భారతీయ వంటకాలను వడ్డించడంతోపాటు తెలుగు సంప్రదాయ పద్ధతుల్లో ఆత్మీయ స్వాగతం పలికింది. తెలుగు వైభవాన్ని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు