చావనైనా చస్తాను..పెళ్లికి మాత్రం ఒప్పుకోను

17 Jun, 2021 09:14 IST|Sakshi

మనసిచ్చాను.. అతన్నే మనువాడతానని ఆమె ‘ప్రేమ’ పట్టుబట్టింది.. వద్దమ్మా.. మా మాట విను అతడ్ని మరిచిపో పెద్దల ‘ప్రేమ’ నచ్చజెప్పింది.. కోరుకున్న ప్రేమ ఓ వైపు.. కన్న ప్రేమ మరోవైపు..  పంతం వీడని కూతురు.. పరువు కోసం కన్నవారు..  మాటా మాటా పెరిగింది.. కన్నోళ్ల కోపం కట్టలు తెగింది.. పెద్దోళ్ల పెళ్లికి ఒప్పుకో.. అన్న హుకుం జారీ చేశాడు..  చావనైనా చస్తాను.. ఒప్పుకోను.. చెల్లి జవాబిచ్చింది.. అమ్మా,నాన్న చూస్తుండగానే తోడబుట్టిన చెల్లి ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.  ప్రేమ పంతానికి..  పరువు పాకులాటకు జరిగిన ఘర్షణలో ఓ కుటుంబం రోడ్డున పడింది. తీవ్రగాయాలతో కూతురు ఆస్పత్రి  పాలవగా.. కన్న తల్లిదండ్రులు, సోదరుడు కటకటాలపాలయ్యారు.   

రాయచోటి: ఆ కుటుంబంలో ప్రేమ మంటలు రేపింది. తాను ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పిన పాపానికి ఓ యువతిపై సొంత సోదరుడే పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన మంగళవారం రాత్రి రాయచోటి పట్టణంలో కలకలం రేపింది. రాయచోటి పట్టణం కొత్తపల్లెలో నివాసం ఉంటున్న పఠాన్‌ మహమ్మద్, మున్వర్‌ జాన్‌ల కుమార్తె  తహసీన్‌కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె తాను ఇమ్రాన్‌ అనే యువకుడిని ప్రేమించానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పింది. అంతే.. కుటుంబ సభ్యుల్లో కోపం కట్టలు తెంచుకుంది. తాము సూచించిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని గట్టిగా చెప్పారు. ఇందుకు ఆమె ససేమిరా.. అనడంతో ఆగ్రహించిన సోదరుడు ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. పక్కనే ఉన్న తల్లిదండ్రులు కన్నకూతురు మంటల్లో కాలుతున్నా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  
చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్న 13 రోజులకే...

మరిన్ని వార్తలు