గ్యాస్‌ లీకై రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం

18 Dec, 2022 05:15 IST|Sakshi
మంటల్లో దగ్ధం అవుతున్న బస్సులు

సుమారు రూ.30 లక్షల నష్టం 

విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో ఘటన  

భవానీపురం(విజయవాడపశ్చిమ): కంప్రెషర్‌ నేచురల్‌ (సీఎన్‌జీ) గ్యాస్‌ లీకయిన కారణంగాఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో రెండు బస్సులు దగ్ధం అయ్యాయి. ఒకటి పూర్తిగా దగ్ధం కాగా పక్కనే ఉన్న మరో బస్‌ పాక్షికంగా కాలిపోయింది.  వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ 11 జడ్‌ 7482 నంబర్‌గల మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌ శుక్రవారం రాజమండ్రిలో ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ కార్యక్రమం నిమిత్తం స్పెషల్‌ సర్వీస్‌గా వెళ్లింది.

తిరిగి రాత్రి సుమారు 2.30 గంటల సమయానికి డిపోకు చేరుకుంది. డిపో ఆవరణలోనే ఉన్న సీఎన్‌జీ గ్యాస్‌ బంక్‌లో గ్యాస్‌ నింపుకుని మెయింటెనెన్స్‌ కోసం గ్యారేజీలో పెట్టారు. అనంతరం గ్యారేజీ వెనుక భాగంలో పార్కింగ్‌ చేసేందుకు వెళుతుండగా గ్యాస్‌ సిలెండర్ల నుంచి గ్యాస్‌ లీకవ్వటాన్ని గమనించిన సిబ్బంది దగ్గరకు వెళ్లి చూసేలోపే మంటలు చెలరేగి బస్‌కు అంటుకున్నాయి. దీంతో అది పూర్తిగా దగ్ధం అయ్యింది.

దాని పక్కనే పార్క్‌ చేసి ఉన్న ఏపీ జడ్‌ 7430 నంబర్‌గల మరో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌కు మంటలు అంటుకుని పాక్షికంగా (డ్రైవర్‌ క్యాబిన్‌తోపాటు వెనుక భాగాన కొన్ని సీట్లు) కాలిపోయింది. ఘటన జరిగిన విధానాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు  పరిశీలించారు.   

మరిన్ని వార్తలు