ఎస్పీ చెంతకు ఎలుక పంచాయితీ..ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యం

6 Dec, 2022 09:50 IST|Sakshi

సాక్షి, అనంతపురం: కర్రీ పాయింట్‌లో కొనుగోలు చేసిన పప్పులో ఎలుక వచ్చిందని ప్రశ్నించిన పాపానికి తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను బాధితులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురం నగరంలోని కమలానగర్‌లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే ఊటకూరి దుర్గాంజలి దంపతులు నివాసముంటున్నారు.

ఈ నెల 2న మధ్యాహ్నం 2.56 గంటలకు దుర్గాంజలి... ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్‌లో రూ.30 చెల్లించి పప్పు, రూ.20 చెల్లించి చెట్నీ పార్శిల్‌ తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లి అన్నంలోకి పప్పు వేసుకోగా అందులో చచ్చిన ఎలుక వచ్చింది. వెంటనే ఆ ప్లేటును తీసుకెళ్లి కర్రీపాయింట్‌ నిర్వహిస్తున్న యజమాని దృష్టికి తీసుకెళ్లారు.

అది చూసిన వారు హోటల్లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు పడడం సర్వ సాధారణమంటూ సమాధానం ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయాన్ని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో కక్షకట్టిన ముత్యాలరెడ్డి కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు.    

(చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు)

మరిన్ని వార్తలు