ఉదయగిరి.. చరిత్రలో ప్రత్యేక స్థానం

20 May, 2022 16:44 IST|Sakshi

అందరి దృష్టి మెట్ట ప్రాంతం వైపే.. 

యుద్ధనౌకకు ఉదయగిరి పేరు

మాసాయిపేటలో బంగారు గని

రూ.100 కోట్లతో పర్యాటకాభివృద్ధికి ప్రతిపాదనలు

మెరిట్స్‌ను వ్యవసాయ యూనివర్సిటీగా మార్చేందుకు చర్యలు

ఉదయగిరి.. చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల గిరులను పోలిన ఎత్తైన పర్వతశ్రేణులు, ప్రకృతి సోయగాలు, జలపాతాలతో కనువిందు చేస్తున్న ఉదయగిరి దుర్గం చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబుల పాలనలో వెలుగు వెలిగింది. ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఆలయాలు, మసీదులు, కోటలు, బురుజుల ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. తాజాగా యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడంతో జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది.

సాక్షి, నెల్లూరు/ఉదయగిరి: జిల్లాలోని ఉదయగిరి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. యుద్ధ నౌకకు ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్‌ క్వార్‌ట్టŠజ్‌ నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్‌ పనులు ముమ్మరంగా చేశారు. ఇంకా ఇక్కడ పర్యాటక రంగ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. 

ఆ కాలంలో.. 
క్రీ.శ 10 నుంచి 19వ శతాబ్దం వరకు ఇక్కడ ఎంతోమంది రాజుల పాలన సాగింది. ఇందులో విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉదయగిరి దుర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అందమైన కట్టడాలు, విశాలమైన తటాకాలు ఈయన కాలంలోనే నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు కొన్నినెలలపాటు ఉదయగిరి కోటను కేంద్రంగా చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ అలనాటి రాజులు, నవాబుల పాలనకు గుర్తుగా ఉదయగిరి కొండపై అద్దాల మేడలు, ఆలయాలు, మసీదులు, కోట బురుజులు దర్శనమిస్తాయి.  

పేరిలా వచ్చింది
సూర్యకిరణాలు ఉదయగిరి కొండ శిఖరంపై ప్రసరించి ప్రకాశవంతంగా దర్శనమిస్తుండడంతో ‘ఉదయ’గిరి పర్వతశ్రేణికి ఉదయగిరిగా పేరు వచ్చినట్లు పెద్దలు చెబుతారు. సముద్రమట్టానికి 3,079 అడుగుల ఎత్తులో  ఈ ప్రాంతం ఉంటుంది. తిరుమల గిరులను ఉదయగిరి పర్వతశ్రేణి పోలి ఉంటుంది. ఇందులో 3,600కి పైగా ఔషధ మొక్కలున్నట్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలో గుర్తించారు. ఉదయగిరి దుర్గం కోటలు, ఎత్తైన ప్రాకారాలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే జలపాతాలతో నిండి ఉంటుంది. ఓ కోటపైన పర్షియా సంప్రదాయ రీతిలో నిర్మించిన మసీదు ఉంది. దేశంతో ప్రసిద్ధి చెందిన చెక్క నగిషీ బొమ్మల తయారీకి ఉపయోగించే దేవదారు చెక్క ఇక్కడ లభ్యమవుతుంది. 

పర్యాటకాభివృద్ధి కోసం..
ఉదయగిరిని పర్యాటకరంగ పరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కలెక్టర్‌ చక్రధర్‌బాబు గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయించారు. హార్సిలీహిల్స్, ఊటీ తరహా వాతావరణం ఉదయగిరి దుర్గంపై ఉంటుంది. అక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర పర్యాటక శాఖకు పంపారు.

అభివృద్ధి చెందుతుంది
ఉదయగిరి సమీపంలో బంగారు, రాగి నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయన్న జాతీయ సర్వే నిపుణుల ప్రకటనలతో ఉదయగిరికి ఖ్యాతి లభించనుంది. ఎక్కడో మారుమూల వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలుగుచూడడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశాభావం కలుగుతోంది. మొత్తంగా రెండు, మూడురోజల వ్యవధిలో ఉదయగిరికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. భవిష్యత్‌లో అభివృద్ధి చెందుతుందనే కాంక్ష ఈ ప్రాంతవాసుల్లో బలంగా ఉంది.
– ఎస్‌కే ఎండీ ఖాజా, ఉపాధ్యాయుడు 

ఉదయగిరికి జాతీయ కీర్తి 
ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఉదయగిరికి జాతీయ గుర్తింపు లభించడం సంతోషం. జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరి దుర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. దీంతో వెనుకబడి ఉదయగిరి ప్రాంతం అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ఒక గుర్తింపు తగిన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందుతుంది. రక్షణ రంగంలో కీలక యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడం చారిత్రాత్మకం. 
– గాజుల ఫారుఖ్‌ అలీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యుడు

ఖనిజ నిక్షేపాల కోసం.. 
ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ జరిగింది. ఈక్రమంలో ఆ కొండపై రాగి, బంగారం, తెల్లరాయి ఖనిజ నిక్షేపాలున్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా  ప్రాథమికంగా గుర్తించింది.. ప్రస్తుతం ఆ ఖనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్‌ పనులు చేపట్టారు. మొత్తంగా ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1,000 అడుగుల మేర డ్రిల్లింగ్‌ నిర్వహించి 46 నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఖనిజ నిక్షేపాలున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. 

అగ్రీ యూనివర్సిటీ
మెరిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను అగ్రికల్చర్‌ యూనివర్సిటీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో కూడా తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్మారకార్ధంగా దీనిని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థులకు కూడా మక్కువ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్సిటీ కోసం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుమారు రూ.250 కోట్ల విలువైన భూములు, ఆస్తులను అప్పగించారు. ఇది ఏర్పాటైతే విద్యార్థులు అగ్రికల్చర్‌ కోర్సులు చదివేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.   

యుద్ధ నౌకకు పేరు
ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ముంబైలో ప్రారంభించారు. పోరాట సామర్థ్యానికి మరింత పదును పెట్టే యుద్ధ నౌకకు ఏపీలోని నెల్లూరు జిల్లా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడంతో ఈ ప్రాంత ఖ్యాతి మరింత చరిత్రపుటల్లోకెక్కింది. దీనిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ప్రముఖులు రాజ్‌నాథ్‌సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

మరిన్ని వార్తలు