స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టుల భర్తీకి రాజీలేని చర్యలు 

19 Dec, 2022 04:15 IST|Sakshi

ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌  

పచ్చ పత్రికల్లో కథనాలకు ఖండన  

సాక్షి, అమరావతి: వైద్యారోగ్య శాఖలో స్పెషలిస్ట్‌ వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం రాజీ లేకుండా చర్యలు చేపడుతోందని ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి ఓ వైపు పలు రకాలుగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే.. ప్రభుత్వ సేవల్లో చేరడానికి స్పెషలిస్ట్‌ వైద్యులు ఆసక్తి చూపడం లేదంటూ పచ్చ పత్రికలో కథనాలు రాస్తున్నారు.

ఆ వార్తలను ఖండిస్తూ కమిషనర్‌ వినోద్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే.. 61 శాతం స్పెషలిస్ట్, 50 శాతం జనరల్‌ ఫిజిషియన్‌ల కొరత ఉందని పేర్కొన్నారు. అదే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వైద్యుల అందుబాటులో దేశంలోనే ఏపీ అగ్ర స్థానంలో నిలుస్తోందని తెలిపారు.

2019 జూన్‌ నాటికి ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో 1,250 స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత ఉండేదని, ఈ క్రమంలో ఎనిమిది నోటిఫికేషన్‌లు జారీ చేయడం ద్వారా 277 గైనిక్, 234 అనస్తీషియా, 146 పీడియాట్రిషన్, 144 జనరల్‌ మెడిసిన్, 168 జనరల్‌ సర్జన్, 55 ఆర్థో, 78 ఆప్తామాలజీ, 65 ఈఎన్‌టీ, మిగిలిన స్పెషాలిటీల్లో 145 పోస్టులు భర్తీ చేసినట్టు తెలిపారు.

403 స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి గత అక్టోబర్‌ వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహించగా 251 పోస్టులు భర్తీ అయినట్టు తెలిపారు. వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 250 పోస్టుల భర్తీకి తాజాగా వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 110 పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌లు సహకరించక, పలు పోస్టుల్లో అభ్యర్థులు లేకనే కొన్ని పోస్టులు భర్తీ అవ్వడం లేదని వివరించారు.

స్పెషలిస్ట్‌ వైద్యులను ప్రభుత్వ సేవల్లోకి ఆకర్షించడం కోసం అన్ని చర్యలనూ ప్రభుత్వం తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే గ్రామీణంలో రూ.2 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.2.50 లక్షల వేతనాన్ని కూడా ఇస్తున్నామని తెలిపారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా చింతూరు, కూనవరం, పాడేరు వంటి ఆస్పత్రులనూ ఎంపిక చేసుకుని వైద్యులు చేరుతున్నట్టు ఏపీ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు.    

మరిన్ని వార్తలు